
ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత నటించారు. “టైగర్ నాగేశ్వరరావు” చిత్రంలో ఆమె ఒక పాత్ర పోషించారు.
హేమలత లవణం పాత్ర చెయ్యడం అదృష్టం!
“టైగర్ నాగేశ్వరరావు” చిత్రంలో నేను హేమలతా లవణం పాత్ర పోషించాను. ఆమె గొప్ప సామాజికవేత్త. అప్పట్లో చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ ఉన్న బందిపోటులలో మార్పు తేగలిగారు. ఇక జోగిని వ్యవస్థపై, అంటరానితనం పై పోరాటం చేశారు. హేమలత లవణం గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతం. దర్శకుడు వంశీ ఈ సినిమా తో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటారు. రవితేజ గారితో నటించడం ఒక గౌరవం.
కెరీర్ జర్నీ…
నేను స్టయిలిస్ట్ గా చేశాను డిజైనర్ గా చెయ్యలేదు. “ఖుషి” సినిమాకి ముందు కళ్యాణ్ గారితో షాపింగ్ కి వెళ్ళినపుడు నా స్టయిలింగ్ సెన్స్ ఆయనకి నచ్చింది. నువ్వే చేసేయ్ అన్నారు. అలా స్టయిలిస్ట్ ని అయ్యాను. హీరోయిన్ గా నటించాను. ఇప్పుడు ఈ పాత్ర.

నటన కొనసాగింపు
నాకు నటించేలానే ఉంది. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటన కొనసాగిస్తాను.
హీరోగా అకీరా ఎంట్రీ
కొడుకును హీరోగా చూసుకోవాలని ప్రతి తల్లికి ఉంటుంది. కానీ అకీరాకి ఇప్పటివరకు నటనపై ఆసక్తి లేదు. వాడు పియానో నేర్చుకున్నాడు. ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ వచ్చు. కానీ నటన గురించి ఇప్పటివరకు ఏమి చెప్పలేదు. మావాడు చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన లక్షణాలు తనలో ఉన్నమాట వాస్తవమే కానీ హీరో కావాలని ముందు తనకి అనిపించాలి కదా.