
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ పాత్రల కోసం మేకప్ వేసుకున్నారు. ఆమె కొత్త ఇన్నింగ్స్ గురించి ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె తాను నటిస్తున్న పాత్ర గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వ రరావు’ అనే చిత్రంలో ఆమె ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె హేమలతా లవణంగా కనిపిస్తారు. హేమలతా లవణం ఒకప్పుడు సోషల్ వర్కర్. ‘‘హేమలతా లవణం పాత్ర స్ఫూర్తిదాయకమైన పాత్ర. ఆ పాత్రలో నేను బాగుంటానని నమ్మి నందుకు దర్శకుడు వంశీకృష్ణకు థాంక్స్,” అంటూ ఆమె రాసుకున్నారు.
1970లలో జరిగిన స్టూవర్టుపురం దొంగల కథ ఇది. గడగడలాడించిన దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోంది ఈ సినిమా. జోగిని వ్యవస్థ నిర్మూలణకు, అలాగే ఈ బందిపోటు దొంగల సంస్కరణకు హేమలతా లవణం పాటుపడ్డారు.
ఆమె ఇంతకుముందు ‘బద్రి’, ‘జానీ’ సినిమాల్లో నటించారు. ఒక హిందీ సినిమా కూడా డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు పుణేలో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
“టైగర్ నాగేశ్వరరావు” సినిమాని డైరెక్టర్ వంశీ కృష్ణ తీస్తున్నారు. ఆయన ఇంతకుముందు దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలు తీశారు.