
ఇద్దరు స్త్రీల మధ్య ఉండే ప్రేమ సంబంధం కూడా గొప్ప ప్రేమకథే అవుతుంది అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక లెస్బియన్ లవ్ స్టోరీ తీశారు. దానికి ఆయన మొదట పెట్టిన పేరు… డేంజరస్. తర్వాత ‘మా ఇష్టం’ అని మార్చారు. రేపు (ఏప్రిల్ 8) విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది.
అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల ఆపాలని నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. ఈ సినిమా కోసమని తన దగ్గర తీసుకున్న 50 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేంతవరకు ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ ఆయన చేసిన అభ్యర్ధనని కోర్టు మన్నించి, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఐతే, రామ్ గోపాల్ వర్మ మాత్రం తన సినిమా విడుదల ఆగిపోవడానికి కారణం అది కాదంటున్నారు.
“మా ఇష్టం సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను – మీ రామ్ గోపాల్ వర్మ,” అంటూ ఇలా ప్రకటన జారీ చేశారు.
కారణం ఏదైనా… ‘మా ఇష్టం’ విడుదల ఆగిపోయింది. వర్మ గత కొంతకాలంగా అప్సర రాణి, నైనా గంగూలీల ఫోటోలు, వారి మధ్య చిత్రీకరించిన శృంగార సన్నివేశాలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేశారు. ఇప్పుడు సినిమా విడుదల ఆగింది.