
ఈ రోజు కోసం చాన్నాళ్లుగా ఎదురుచూసింది. చాలా ఆశలు పెట్టుకుంది. కానీ రియా చక్రవర్తి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ముంబయి హైకోర్టులో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈరోజు అసలు విచారణకే రాలేదు. దీనికి కారణం భారీ వర్షాలు.
అవును.. ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఆఖరి నిమిషంలో చాలా కార్యాలయాలు మూతపడ్డాయి. హైకోర్టు కూడా ఈ లిస్ట్ లో ఉంది. దీంతో రియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
మరోవైపు రియా చక్రవర్తి కోర్టుకు సమర్పించిన 47 పేజీల బెయిల్ పిటిషన్ లోని అంశాలు కూడా బయటకొచ్చాయి. ఎంక్వయిరీ ఏజెన్సీలపై, సుశాంత్ పై ఆ పిటిషన్ లో రియా తీవ్ర ఆరోపణలు చేసినట్టు ఓ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.
ఇండియాటుడే ఛానెల్ కథనం ప్రకారం.. తన బెయిల్ పిటిషన్ లో రియా చక్రవర్తి, సుశాంత్ పై చాలా ఆరోపణలు చేసింది. సుశాంత్ ఒక్కడే డ్రగ్స్ తీసుకుంటాడని, వాటి కోసం స్టాఫ్ తో పాటు తనను వాడుకున్నాడని రియా అందులో ఆరోపించిందట. చనిపోవడానికి 3 రోజుల ముందు కూడా సుశాంత్ హై-డోస్ మాదకద్రవ్యాలు తీసుకున్నాడని రియా తన పిటిషన్ లో పేర్కొంది.
ఒక్క ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా విడిచిపెట్టకుండా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని.. తను, తన సోదరుడు మాత్రం బుక్కయ్యామని రియా తన బెయిల్ పిటిషన్ లో ఆవేదన వ్యక్తంచేసినట్టు జాతీయ మీడియా తెలిపింది.