
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం “ఆర్ఆర్ఆర్” (RRR) దసరాకి విడుదల కాబోవడం లేదని మనందరికీ తెలుసు. ఆ విషయంలో మేకర్స్ అధికారిక ప్రకటన చేశారిప్పుడు. కానీ కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. ప్రపంచ సినిమా మార్కెట్ అంతా ఓపెన్ అయిన తరువాత రిలీజ్ చేస్తామన్నట్లుగా చెప్తున్నారు.
మొన్నటివరకు మేం సంక్రాంతికి వస్తున్నామని ఇండస్ట్రీలోని వారికి చెప్పింది ఈ టీం. కానీ, ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఆ డేట్ కి వస్తుందా అన్నది డౌటే. “ఆర్ఆర్ఆర్” మామూలు పెద్ద సినిమా కాదు. చాలా పెద్ద మూవీ. అంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న సినిమా. అన్ని చోట్లా మార్కెట్ అనుకూలంగా ఉండాలి. అదే ఈ సినిమాకి సమస్య.
మన దేశంలోనే మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రంలో సినిమా థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. మరో నెల రోజుల తర్వాత ప్రారంభం కావొచ్చు. ఇంకా కేరళలో జనవరి వరకు థియేటర్లు ఓపెన్ కావడం కష్టమే. అక్కడ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళ సినిమాలన్నీ ఓటిటిల్లో విడుదల అవుతున్నాయి. మలయాళంలో కూడా “ఆర్ఆర్ఆర్” విడుదల కానుంది. అందుకే, రిలీజ్ డేట్ విషయంలో ఆచితూచి ప్రకటిద్దామని అనుకుంటున్నారట రాజమౌళి.
ఈ సినిమాని ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేశారు. టీం చెప్తున్న డేట్స్ ని ఎవరూ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే, ఈ సారి కొత్త డేట్ ప్రకటిస్తే… డేట్ మార్చకుండా ఉండాలి అని పట్టుదలగా ఉన్నారు రాజమౌళి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే కొత్త విడుదల తేదీ చెప్తారట.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేశారు. ఒకటి, రెండు రోజుల పని మిగిలి ఉంది. అది కూడా ఈ నెలలోనే పూర్తి అవుతుంది. దాంతో, వారు ఆర్ ఆర్ ఆర్ గెటప్ నుంచి బయటికి వస్తారు ఇక.