ఆర్ఆర్ఆర్ – మూవీ రివ్యూ

NTR and Ram Charan

నాలుగేళ్ల నిరీక్షణ… భారీ బడ్జెట్ సినిమా…అతి పెద్ద మల్టీస్టారర్.. . బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ప్రాజెక్టు… ఇన్ని అంచనాల మధ్య విడుదలైంది ‘ఆర్ ఆర్ ఆర్’. రాజమౌళి సినిమాల విషయంలో సాధారణంగా డివైడ్ టాక్ రాదు. కానీ ఇది ఏకగ్రీవంగా అందరూ మెచ్చుకునే సినిమా కాదిది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, జక్కన్న మార్క్ ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన ‘సోల్’ ఆర్ఆర్ఆర్ లో మిస్సయింది.

తెలుగు ప్రజలకు బాగా తెలిసిన కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి సమరయోధుల స్ఫూర్తితో, వాళ్ల పాత్రలకు ఫిక్షన్ అద్ది రాజమౌళి తీసిన ఈ సినిమాలో దేశభక్తి, ఎమోషన్ కంటే యాక్షనే ఎక్కువగా కనిపించింది. ఒక దశలో రాజమౌళి టేకింగ్ కంటే, హాలీవుడ్-ఇండియన్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కలిసి తీసిన యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా హైలెట్ అయ్యాయి. . కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇదే నిజం. సహజంగా బాహుబలి ఫ్రాంచైజీతో ఆర్ఆర్ఆర్ ను పోలుస్తారు కాబట్టి, మనం కూడా అదే కంపారిజన్ ను ఇక్కడ చూసుకుందాం. బాహుబలి-2లో ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది. కాబట్టి యాక్షన్ హైలెట్ అయింది. ఆర్ఆర్ఆర్ లో అది రివర్స్ అయింది. హైలెట్ అయిన యాక్షన్ సన్నివేశాలు ఎమోషన్ ను తొక్కుకుంటూ పోయాయి. ఒక దశలో కంటెంట్ లో ఎమోషన్ కంటే తెరపై కనిపించే ఆర్ట్ వర్క్, తీగలతో హీరోలు చేసిన యుద్ధ విన్యాసాలే ముందు సీట్లో కూర్చుంటాయి.

1920, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాలో చరణ్ ను నిప్పుకి, ఎన్టీఆర్ ను నీరుకి ప్రతీకగా చూపించారు. ఢిల్లీలో బ్రిటిషర్ల దగ్గర పోలీసాఫీసర్ గా పనిచేస్తుంటాడు రామరాజు. పైకి ఖాకీ అయినప్పటికీ అతడి ఆశయం అత్యుత్తమం. బడబాగ్నిని తన మనసులో దాచుకున్న అగ్నిపర్వతం అది. ఇక తన గోండు పిల్ల మల్లిని బ్రిటిషర్లు ఢిల్లీకి తీసుకుపోవడంతో, ఆమెను విడిపించేందుకు అక్కడ అడుగుపెడతాడు భీమ్. స్కాట్ దొరకు ప్రమాదకరంగా మారిన భీమ్ ను పట్టుకునేందుకు మఫ్టీలో తిరుగుతుంటాడు రామరాజు. ఒకరి రహస్యం మరొకరికి తెలియకుండానే ఇద్దరూ స్నేహితులు అవుతారు.

భీమ్ ఎవరో తెలిసే సమయానికి రామరాజు పూర్తిగా అతడి స్నేహంలో మునిగిపోతాడు. ఇంతకీ రామరాజును భీంని అరెస్ట్ చేస్తాడా? రామరాజు మన్యం వీడి ఢిల్లీలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడు? అనేది మిగతా కథ.

ఈ కథలో రామ్ ను నిప్పుగా, భీమ్ ను నీరుగా చూపించడానికి చాలానే కష్టపడ్డాడు రాజమౌళి. నిజానికి ఫస్టాఫ్ లో చాలా సమయం దీనికే కేటాయించాడు. నిజానికి ఈ కథకు నీరు-నిప్పు కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాడో ఆయనకే తెలియాలి. అలాంటివేం చూపించకుండా కూడా కథను నడిపించొచ్చు. ఈ కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల ఫస్టాఫ్ లో చాలా టైమ్ కిల్ అయింది. అయినప్పటికీ వీలైనంత తొందరగానే కథలోకి వెళ్లాడు దర్శకుడు. రామ్-భీమ్ పాత్రల్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లగలిగాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ ఛేజ్ ఎపిసోడ్ కు మరోసారి లాంగ్ టైమ్ కేటాయించాడు.

తొలి అర్థభాగంలో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నప్పటికీ ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ కు వచ్చేసరికి తన మార్క్ చూపించాడు జక్కన్న. పడుతూలేస్తూ సాగిన స్క్రీన్ ప్లే ఇంటర్వెల్ సీన్ కు వచ్చేసరికి పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది. ఆ సన్నివేశాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది కదా రాజమౌళి మార్క్ అనిపిస్తుంది.

ఎప్పుడైతే అజయ్ దేవగన్ ఎంటర్ అవుతాడో, ఇక అక్కడ్నుంచి అసలైన ఎమోషన్ మొదలవుతుంది. చరణ్ కు లింక్ పెడుతూ వచ్చిన ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో స్టోరీ ఊపందుకుంటుంది. సెకండాఫ్ లో కథ మొత్తం మనం ఊహించనట్టే సాగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో “కొమరం భీముడో” సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. పాటతో పాటు వచ్చే ఆ మొత్తం సీక్వెన్స్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్ ప్రాణం పెట్టేశాడు. సెకండాఫ్ మొత్తాన్ని నిలబెట్టింది ఈ ఎపిసోడ్. కానీ, ఇక్కడే ప్రధానమైన లోపం కూడా బయటపడుతుంది. కొమరం భీంకి తన మల్లిని తీసుకురావడం లక్ష్యం, రామరాజుకి తన మట్టి కోసం తపన. ఇద్దరివీ వేర్వేరు లక్ష్యాలు. రెండు ట్రాకుల్లా వెళ్తున్న వారి గమ్యాలు మధ్యలో క్రాస్ అవుతాయి. అక్కడే బండి బోల్తా పడుతుంది.

అలాగే చాలా సన్నివేశాలు ర్యాండమ్ గా అలా వచ్చి వెళ్లిపోతుంటాయి. ఉదాహరణకి రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కలిపేందుకు అని కాబోలు ఒక రైల్వే బ్రిడ్జ్ నుంచి వెళ్తున్న రైలు బోగీలు తప్పి నదిలో పడుతుంది. నదిలో ఒక పిల్లాడు చిన్న తడవలో వెళ్తుంటాడు. అతన్ని కాపాడేందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చేసే సాహసం సిల్లీగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు దూకి కాపాడకుండా… వారి చేసే విన్యాసాలు… మా దగ్గర డబ్బులు ఉన్నాయి… గ్రాఫిక్స్ లో హడావిడి చేసి చూపిస్తాం అని చెప్పేందుకు పెట్టినట్లుగా ఉంది. అంతే తప్ప సహజంగా లేదు.

ఇంకో సన్నివేశంలో ఎన్టీఆర్ నీళ్లలో దాక్కుంటాడు. మళ్ళీ దర్శకుడు ఎప్పుడు క్యు ఇస్తాడా అన్నట్లుగా చాలా సేపు నీటిలో మునిగి సడెన్ గా లేస్తాడు. ఇలాంటి బిల్డప్ ఎక్కువ మేటర్ తక్కువ సీన్లతో రాజమౌళి ముద్ర మసకబారింది.

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ విషయానికొస్తే.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్లిద్దరూ. రామరాజుగా రామ్ చరణ్ ఎన్నో ఎమోషన్స్ పండించాడు. నిజానికి సినిమా ఆరంభంలో చరణ్ పాత్ర పెద్దగా హైలెట్ అవ్వదు. పైగా ఎన్టీఆర్ పులి ఫైట్ తర్వాత రామ్ రాజును దాదాపు ప్రేక్షకుడు మరిచిపోతాడు. అలాంటి టైమ్ లో మెల్లమెల్లగా రామరాజు గ్రాఫ్ ను పెంచుకుంటూ వచ్చాడు దర్శకుడు. సెకండాఫ్ కు వచ్చేసరికి రామరాజు పాత్రే హైలెట్ అవుతుంది. ఇక కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశాడు. ఇంట్రో నుంచి క్లైమాక్స్ వరకు తారక్ నటనలో ఎక్కడా వంకలు పెట్టడానికి లేవు. నదిలా నిర్మలంగా కనిపిస్తూనే, అవసరమొచ్చినప్పుడు ఉప్పెనలా ప్రళయం సృష్టించే పాత్రలో ఎన్టీఆర్ మెరిశాడు. కాకపొతే, అతని పాత్రకే రెండో సగంలో అర్ధవంతమైన ముగింపు లేదు.

అలియాభట్ కు సినిమాలో ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. 3 గంటల సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ ఫీలింగ్ వస్తుందేమోనని రోలింగ్ టైటిల్స్ లో వచ్చే సాంగ్ లో అలియాభట్ ను పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. సినిమాలో కంటే.. రోలింగ్ టైటిల్స్ లోనే అలియా ఎక్కువగా కనిపిస్తుంది. అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ పెద్దగా ప్రభావం చూపించలేదు.

టెక్నికల్ గా సినిమా బాగుంది. టెక్నీషియన్స్ నుంచి మ్యాగ్జిమమ్ అవుట్ పుట్ తీసుకోవడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఆర్ఆర్ఆర్ లో కూడా అదే కనిపించింది. కీరవాణి పాటలు సందర్భానుసారంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైన్ సాబు శిరిల్ ల పనితనం అదుర్స్. ఎవరి బెస్ట్ వాళ్లిచ్చారు. అయితే ఈ లిస్ట్ నుంచి ఎడిటర్ ను కాస్త సైడ్ కు జరపాల్సి రావొచ్చు.

దర్శకుడిగా రాజమౌళి మరోసారి తన మార్క్ చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో, కొన్ని సన్నివేశాల్ని ఊహించడంలో అతడు మాస్టర్ అనిపించుకున్నాడు. అయితే తన బలం … ఎమోషన్. ఆ విషయంలోనే ఆయన తడబడ్డారు.

చివరగా ఒక్కమాటలో….

యాక్షన్ ఎపిసోడ్స్, ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టార్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, కొమురం భీముడో ఎపిసోడ్ ఆర్ఆర్ఆర్ లో హైలెట్స్ గా నిలుస్తాయి. నెరేషన్ రొటీన్ గా ఉండడం, బలమైన ఎమోషనల్ సీన్స్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా తోస్తాయి. కళ్లుచెదిరే కలెక్షన్లు రావొచ్చేమో కానీ, కళ్లు చెమర్చే సన్నివేశం మాత్రం ఇందులో కనిపించదు. భారీతనం కోసం తాపత్రయం ఉంది.

Rating: 3/5

Reviewed by: పంచ్ పట్నాయక్

Advertisement
 

More

Related Stories