
“ఆర్ ఆర్ ఆర్” సినిమా నిజంగా అక్టోబర్ 13న విడుదల అవుతుందా? ఇది అందరిలో ఉన్న పెద్ద డౌట్. ఇండియాలో మూడు, నాలుగు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా థియేటర్లు ఓపెన్ కాలేదు. కీలకమైన నార్త్ ఇండియాలో ఇప్పట్లో థియేటర్ మార్కెట్ పుంజుకునే అవకాశం లేదు. అందుకే, “ఆర్ ఆర్ ఆర్” మరోసారి వాయిదాపడుతుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
కానీ ఆ సినిమా టీం మాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది. అస్సలు పబ్లిసిటీ ఆపట్లేదు. ఈ నెల 9 నుంచి ఎన్టీఆర్ “ఆర్ ఆర్ ఆర్” సినిమాని ఇన్ స్టాగ్రామ్ లో కూడా ప్రమోషన్ చేస్తాడట. వీళ్ళ దూకుడు చూస్తుంటే… అక్టోబర్ 13 రిలీజ్ అనేది పక్కా అని అర్థం అవుతోంది.
రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 700 కోట్ల వ్యాపారం చేసింది. థియేటర్ హక్కుల ద్వారా 400 కోట్లు వస్తే… మరో 300 వందల కోట్లు ఇతర ఆదాయం. ఈ సినిమా విడుదల అనేది చాలా పెద్ద వ్యవహారం. ఆషామాషీగా రిలీజ్ డేట్ ప్రకటించడం, వాయిదా వెయ్యడం ఉండదు. దాని వెనకాల చాలా ప్లానింగ్ ఉంటుంది. మరి ఇప్పుడు రాజమౌళి టీం దూకుడు చూస్తుంటే… అక్టోబర్ 13 డేట్ నుంచి వెనక్కి వెళ్ళేది లేదు అన్నట్లుగా ఉంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించడంతో ఇరువైపులా ఫ్యాన్స్ అంచనాలు స్కై లెవల్లో పెట్టుకున్నారు.అనుకున్నట్లు అక్టోబర్ 13కి వస్తే ఆంధ్ర, తెలంగాణల్లో థియేటర్ల ముందు జాతర ఉంటుంది.