భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 95వ ఆస్కార్ అవార్డుల పండుగ జరగబోతోంది. ఈ సారి మూడు భారతీయ చిత్రాలు పోటీలో ఉన్నాయి. రెండు డాక్యుమెంటరీ చిత్రాలు కాగా, మరోటి పక్కా కమర్షియల్ చిత్రం.. ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం తెలుగునాట ఆస్కార్ ఫీవర్ పట్టుకొంది.
“నాటు నాటు” సాంగ్ కి ఆస్కార్ అవార్డు వస్తుందని బెట్టింగ్ ల దందా షురూ అయింది. హైదరాబాద్, భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ రేంజ్ లో ఈ దందా జరుగుతోందట. ఫిలింనగర్ లో కూడా కొందరు నిర్మాతలు, దర్శకులు బెట్టింగ్ పెట్టారు. “నాటు నాటు”కి అవార్డు గ్యారెంటీ అని ఒక బడా నిర్మాత కోటి రూపాయల బెట్టింగ్ కట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
నిర్మాత కోటి రూపాయల బెట్టింగ్ అనే మాటలో నిజానిజాలు ఎలా ఉన్నా… లక్షల్లో మాత్రం ఈ దందా జరుగుతోంది. సోమవారం ఫలితాలు వచ్చేంతవరకు సాగుతుంది. ప్రస్తుతానికి ఐతే “ఆర్ ఆర్ ఆర్”కి ఆస్కార్ వస్తుందనే నమ్మకం అందరిలో ఉంది. హాలీవుడ్ లో ప్రచారం కూడా అదే విధంగా సాగుతోంది. మరోసారి, రాజమౌళి ప్రచారంలో, మార్కెటింగ్ లో దిట్ట అని నిరూపించుకున్నారు.
ఇక, ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆస్కార్ కోసం గుళ్లో పూజలు నిర్వహిస్తున్నారు.