
కొత్త రికార్డులు చెప్పుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు ‘ఆర్ ఆర్ ఆర్’ టీం. విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు సినిమా వాయిదాపడింది. జనవరి 7, 2022న విడుదల కావాల్సిన “ఆర్ ఆర్ ఆర్” నిరవధికంగా పోస్టుపోన్ అయింది. కొత్త డేట్ ఎప్పుడో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు.
“ఆర్ ఆర్ ఆర్” ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా అంచనాలు ఆకాశాన్నంటాయి. బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా ఆడుతుందన్న నమ్మకం అందరికి కుదిరింది. అందుకే, రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ థియేటర్ల వద్ద ఇప్పటికే బ్యానర్లు, కటౌట్లు రెడీ చేసి పెట్టారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు డేట్ మారిపోయింది.
ఇప్పటికే అనేకసార్లు డేట్ మార్చుకొంది ఈ మూవీ. అందుకే, రాజమౌళి ఈ సినిమాకి గట్టిగా ప్రమోషన్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ లను అనేక నగరాలు తిప్పుతూ నెల రోజులుగా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కించారు. ముంబై, చెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం నగరాల్లో ఈవెంట్స్ చేశారు. తొలిసారిగా ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కాన్సెప్ట్ ని పరిచయం చేశారు.
ముంబై ఈవెంట్ కి హైదరాబాద్ నుంచే రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులను ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లారు. పబ్లిసిటీ కోసం హీరోలు, దర్శకుడు, నిర్మాత అందరూ ఎంతో కష్టపడ్డారు. నిర్మాత దానయ్య డబ్బులు ఫుల్లుగా స్పెండ్ చేశారు. గత నెల రోజుల ఈవెంట్స్, పబ్లిసిటీకే దాదాపు 5 కోట్లు ఖర్చు అయి ఉంటుంది అని అంచనా. ఇపుడు అదంతా వెస్ట్ అవుతుందా?
సినిమా మరీ లెట్ గా విడుదల అయితేనే సమస్య. రెండు, మూడు నెలల్లో రిలీజ్ ఐతే ఈ ప్రచారం వృథా కాదు. ఎక్కువ గ్యాప్ వస్తే మాత్రం మళ్ళీ మొదటి నుంచి పబ్లిసిటీ షురూ చెయ్యాల్సి ఉంటుంది.