
అగ్ర దర్శకుడు రాజమౌళికి కలెక్షన్లు చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు అని మొన్నటి వరకు చెప్పింది ఆయన టీం. అలాగే, ఆయన తన నిర్మాత కానీ, తన పీఆర్ టీం కానీ కలెక్షన్లతో కూడిన పోస్టర్ విడుదల చెయ్యదు అని గొప్పలు పోయారు. ఇంతకుముందు వచ్చిన కలెక్షన్ల పోస్టర్లని హిందీ నిర్మాత ఖాతాలో వేసేశారు.
కానీ, ఈ రోజు అధికారికంగా ‘1000 కోట్ల వసూళ్లు’ అంటూ నిర్మాత దానయ్యకి చెందిన నిర్మాణ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, “ఆర్ ఆర్ ఆర్” మూవీ హ్యాండిల్ నుంచి పోస్టర్ ని వదిలారు. ఇంతకుముందు వచ్చిన పోస్టర్లు ఎవరు చేసి వదిలారో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు ఇక.
రాజమౌళికి కూడా కలెక్షన్లు, రికార్డుల మోజు ఉంది. అది ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ, వాటికి ఆయన అతీతం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది ఆయన టీం.
మొత్తానికి రాజమౌళి ఖాతాలో రెండు ‘1000 కోట్ల’ (ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్) సినిమాలు ఉన్నాయి. ఒకటి బాహుబలి 2, రెండోది ‘ఆర్ ఆర్ ఆర్’. కానీ, రెండో సినిమా వసూళ్లు, నంబర్ల విషయంలో చాలా గోల్ మాల్ ఉందని ఇండస్ట్రీ టాక్.