RRRకి మొండిచెయ్యి ఎందుకంటే..!

NTR and Ram Charan

రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ని పక్కనపెట్టి గుజరాతీ సినిమా ‘చేలో షో’ని ఆస్కార్ అవార్డ్ పరిశీలనకి పంపడం పెద్ద దుమారమే రేపింది. కేంద్ర ప్రభుత్వం అంతా ‘గుజరాత్’మాయం చేస్తోంది అంటూ రాజకీయనాయకులు కూడా ఈ విమర్శలకు పదం కలిపారు. దాంతో, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్ కమిటీ అధ్యక్షుడు నాగభరణ స్పందించారు.

” ఆర్ ఆర్ ఆర్ కూడా మంచి సినిమానే. ఆ మాటకొస్తే మొత్తం 13 చిత్రాలు కూడా దేనికవే మెరిట్ ఉన్న చిత్రాలు. ఐతే, ఒక్క సినిమా మాత్రమే సెలెక్ట్ చెయ్యాలి కదా. అందుకే ‘చేలో షో’ని ఆస్కార్ పరిశీలనకి పంపామ’ని తెలిపారు నాగభరణ.

“ఆర్ ఆర్ ఆర్ సినిమాపై వ్యతిరేకత ఏమి లేదు. కానీ ఆ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధించదనో, ఎక్కువమంది జనం చూశారనో సెలెక్ట్ చెయ్యలేం. ‘చేలో షో’ కథలో, కథనంలో అందరికీ నచ్చే మానవీయ కోణం ఉంది. ఆ సినిమా పిల్లల అమాయకత్వం, వారి కలల ప్రపంచం గురించి. నువ్వు కల కని దానికోసం పోరాటం చేస్తే నీ కల నిజమవుతుంది అనే ఒక ఆశని చిగురింప చేస్తుంది ఈ సినిమా. ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అయ్యే థీమ్. అందుకే, ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఇతర సినిమాలను పక్కన పెట్టి ఈ గుజరాతీ సినిమాకే జ్యురిలో ఉన్న అందరం ఓటేశాం,” అని ఆయన తెలిపారు.

గుజరాతీ సినిమాని ఎంపిక చెయ్యడం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. “ఆర్ ఆర్ ఆర్” నిర్మాతలు వేరే రూపంలో ఆస్కార్ అవార్డులకు పంపితే తమకు ఏ అభ్యంతరం లేదన్నారు.

“దేశం తరఫున పంపే సినిమా వేరు. అది మన దేశాన్ని గొప్పగా రెప్రజెంట్ చెయ్యాలి. ఆ విషయంలో చేలో షో కరెక్ట్,” అని క్లారిటీ ఇచ్చారు నాగభరణ.

Advertisement
 

More

Related Stories