
సాయి ధరమ్ తేజ్ రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం ఆయన అభిమానులకు, సినిమా ఇండస్ట్రీలోని వారందరికీ షాక్ గురి చేసింది. వినాయక చవితి నాడు బైక్ రైడ్ చేస్తూ ప్రమాదానికి గురి కావడంతో అందరూ ఆందోళన చెందారు. ఐతే, అదృష్టవశాత్తూ, సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకుంటున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని శనివారం అపోలో వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన బైక్‌పై నుంచి కిందపడిపోయారు. ఇంతకీ ఆయన బైక్ ఎందుకు నడుపుతున్నారంటే… పలువురు హీరోలు సెలవు రోజుల్లో బైక్ రైడ్ కి వెళ్తారు. ట్రాఫిక్ లేని రోజుల్లో బైక్ రైడ్ సరదాని తీర్చుకోవడం కుర్ర హీరోలకు అలవాటే. సాయి తేజ్ కి బైక్ రైడ్ అంటే మరీ మరీ ఇష్టం. లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ ని కొన్నాడు.
ఇటీవల కోవిడ్ వల్ల మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గింది. దాంతో సాయి తేజ్ తరుచుగా బైక్ రైడ్ కి వెళ్తున్నారట. అదే విధంగా శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన చోట వానల కాలంగా రోడ్ పై పేరుకున్న ఇసుక ఉందట. ఇసుక కారణంగా బైక్ స్కిడ్ అయింది.
చిన్న తప్పిదం పెద్ద ప్రమాదానికి గురి చేసింది. ఐతే, స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడం, తొందరగా సమీప హాస్పిటల్ కి తీసుకెళ్లడం సాయి తేజ్ ని కాపాడాయి.