
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్”పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైప్ మామూలుగా లేదు. అయినా ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు థియేటర్ డీల్స్ పూర్తి కాలేదు. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ‘సలార్’. కానీ ఇప్పటివరకు ఏపీ, తెలంగాణాలో ఎవరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది తేలలేదు.
దానికి కారణం నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అడుగుతున్న రేట్లు. ఇంతకుముందు దిల్ రాజు “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి 60 కోట్లు పెట్టి తెలంగాణ (నైజాం) హక్కులు తీసుకున్నారు. ఆ సినిమా ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ఇప్పుడు “సలార్”కి ఈ నిర్మాత 70 కోట్లు అడుగుతున్నారట.
దిల్ రాజు 65 కోట్లు ఇవ్వగలను అని అంటున్నారట. అందుకే ఇంకా ఈ సినిమా బిజినెస్ డీల్ పూర్తి కాలేదు. ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి.
“ఆర్ ఆర్ ఆర్ ” సినిమాకి మించి రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. ప్రభాస్ గత మూడు చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఐతే, “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ కి రాజమౌళిలా చాలా క్రేజ్ ఉంది. ఆయన తీసిన “కేజీఎఫ్ 2” అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే, “సలార్”కి రాజమౌళి సినిమాకి మించి రేట్లు కావాలని అంటున్నారట.