‘సలార్’లో ‘డ్రామా’నే ఎక్కువ: నీల్

Salaar

దర్శకుడు ప్రశాంత్ నీల్ అనగానే “హీరోయిజం ఎలివేషన్” అనే మాట గుర్తొస్తుంది. ప్రతి సన్నివేశం హీరోని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. ఆ పద్దతి జనాలకు బాగా నచ్చింది. అందుకే “కేజీ ఎఫ్” మూవీస్ పాన్ ఇండియా లెవల్లో అంత భారీ విజయం సాధించాయి. ఐతే, ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు, “మేటర్ లేకుండా యాక్షన్”తో సినిమా నడిపిస్తున్నాడనే విమర్శలు కూడా నీల్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

శుక్రవారం విడుదల అవుతున్న “సలార్”లో కూడా ప్రభాస్ హీరోయిజాన్ని ఆకాశం అంత ఎత్తుకు ఎలివేట్ చేస్తాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. కన్నడ స్టార్ యష్ నే నీల్ ఆ లెవల్లో చూపిస్తే ఇండియాలో బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ ని ఇంకా భారీ రేంజ్ లో చూపించాలి కదా. జనం అంతా అదే అనుకుంటున్నారు ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో అదే కనిపించింది.

ఐతే, “సలార్”లో యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ అని అంటున్నారు ప్రశాంత్ నీల్.

“నేను ట్రైలర్ లో మొత్తం ఫైట్స్, యాక్షన్ చూపించాను. కానీ, నా సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుంది. మీలా( రాజమౌళి) అద్భుతంగా డ్రామా చూపించాలని అనుకున్నాను. నేను ప్రభాస్ గారికి కథ చెప్పినప్పుడు ఇది డ్రామా సినిమా అనే చెప్పి ఒప్పించాను. సినిమాలో యాక్షన్ ఉంటుంది. కానీ డ్రామా ఎక్కువ పండుతుంది,” అని నీల్ తాజాగా రాజమౌళితో చేసిన ప్రమోషన్ వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు.

అలాగే, ఈ సినిమాలో హీరో ప్రభాస్, శృతి హాసన్ మధ్య డ్యూయెట్లు ఉండవు అని తెలిపారు ప్రశాంత్ నీల్. “ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్ మధ్య ఉండే ఎమోషనల్ సీన్లు, డ్రామా మీదే కథ నడుస్తుంది. రెగ్యులర్ పాటలు, ఆ హడావిడి ఉండొద్దు అని ముందే అనుకున్నాం,” అని వివరించారు.

Advertisement
 

More

Related Stories