
ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా రకరకాల పనులు పెట్టుకున్నారు. అయితే సమంత మాత్రం పూర్తిస్థాయిలో రైతుగా మారింది. టెర్రస్ గార్డెనింగ్ ను ఓ మిషన్ గా చేపట్టిన ఈ బ్యూటీ.. తనే పండించుకొని, తనే తినడం మొదలుపెట్టింది. ఇలా చేయడం వల్ల తినే ఆహారం విలువ తెలిసొస్తుందంటున్న సమంత.. తనతో పాటు ఎదగమంటూ “గ్రో విద్ మి” అనే క్యాంపెయిన్ ను కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ చేసింది.
ఓవైపు యోగా-మెడిటేషన్ చేస్తూనే మరోవైపు తను పండించే కూరగాయలతో రకరకాల వంటకాలు, జ్యూస్ లు ఎలా చేయవచ్చో వీడియోలు పెడుతోంది. ఇప్పటికే క్యాబేజీ, బ్రకోలీ, టమాట లాంటి కూరగాయల్ని పండించిన సమంత.. తాజాగా తను పండించిన క్యారెట్ పంటను చూపించింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో క్యారెట్స్ ను పండించిన సమంత.. ఈవారం తన మెనూ అదేనంటూ ప్రకటించింది. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడీ, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా.. ఇలా రోజుకో వెరైటీ చేసుకుంటానంటూ ప్రకటించింది.
మొత్తానికి ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిస్థాయిలో రైతుగా మారిపోయింది సమంత. ఎలాంటి రసాయనాలు వాడకుండా కూరగాయల్ని పండిస్తూ, అవే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది.