
సినిమా ఇండస్ట్రీలో నిజం చెప్పేవాడు ఎప్పుడూ ఎదగడు. లౌక్యంగా మెలిగేవాళ్లే ఎక్కువ రాణిస్తారు. లౌక్యంగా ఉండేవాళ్ళతో ఏ సమస్యా లేదు. కానీ సమస్య అంతా ‘భజన లాల్’ బ్యాచ్ తోనే. తెగ భజన చేసేవారిని ‘భజన్ లాల్’ అంటారు.
చాలామంది సెలెబ్రెటీలు పొగడ్తలకు ఎక్కువ పడుతారు. అందుకే, సినిమా ఇండస్ట్రీలో ఈ ‘భజన్ లాల్’ బ్యాచ్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఏ పెద్ద సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమా హీరోని, దర్శకుడిని తెగ పొగిడిసి, ట్వీట్లు గుప్పించే ఒక బ్యాచ్ ఈ మధ్య ఎక్కువ అయింది.
నచ్చిన సినిమా నచ్చింది అని పొగడడంలో ఇంచు కూడా తప్పులేదు. కానీ, సినిమా నచ్చక విమర్శించే వారిని ఈ ‘భజన్ లాల్’ బృందం టార్గెట్ చేస్తుంటుంది. అక్కడే ఇబ్బంది.
ఒక సినిమా నచ్చితే 5/5 ఇచ్చుకుంటావా, ఇంకో రేటింగ్ ఇచ్చుకుంటావా అన్నది ఎవరిష్టం వారిది. కానీ, ఫలానా సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే కేవలం దర్శకులు మాత్రమే ఇవ్వాలి అని తీర్మానిస్తే… భజనకి పరాకాష్ఠ అని చెప్పాలి. ఈ చాట భారతం …సందీప్ వంగా గురించి.
“పుష్ప” సినిమా చూసిన సందీప్ వంగా నిన్న ట్వీట్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటన టెర్రిఫిక్ అని చెప్పారు. సుకుమార్ డైరెక్షన్ గురించి పొగిడారు. ఇంతవరకు ఇసుమంత కూడా తప్పులేదు వంగా రాసినదాంట్లో. ఆయన అభిప్రాయం చెప్పారు. ఐతే, చివర్లో ఈ సినిమాకి కేవలం ఫిల్మ్ మేకర్స్ మాత్రమే రేటింగ్ ఇవ్వాలి అనే ప్రత్యేకంగా నోటు కూడా రాయడంతో ఈయన కూడా భజన మొదలెట్టాడు అని కామెంట్స్ పడుతున్నాయి.
ఎవరు రేటింగ్ ఇవ్వాలో ఎవరు సమీక్షించాలో వంగా సెర్టిఫికెట్ ఎందుకు? ఎవరు సినిమా తీయాలో ఎవరు తీయకూడదో జనం కానీ, మీడియా కానీ చెప్పడం లేదు కదా. ఇలాంటివి చేసే బాలీవుడ్ లో బ్యాడ్ అయ్యాడు వంగా.
‘అర్జున్ రెడ్డి’లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన దర్శకుడిగా వంగాకి మన దగ్గర మంచి పేరుంది. క్రేజుంది. ఆయన సినిమాని మెచ్చుకొని భారీ రేటింగులు వేసింది ఈ క్రిటిక్సే, ఈ జనమే. మరి అప్పుడు నో పోలీస్ (సింహ స్టయిల్లో చదువుకోండి).