మరికొన్నాళ్లు జైలులోనే సంజన

Sanjjana

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ సంజనా గల్రానీకి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను బెంగళూరు ప్రత్యేక కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో మరికొన్నాళ్ల పాటు సంజనా జైళ్లోనే ఉండబోతోంది. అటు సంజనాతో పాటు బెయిల్ కు అప్లయ్ చేసుకున్న మరో హీరోయిన్ రాగిణి ద్వివేది పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజనా, రాగిణిలపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా నమోదయ్యాయి. వీటిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విచారణ కీలక దశకు చేరుకున్న ఈ దశలో ఈ ఇద్దరికీ బెయిల్ ఇస్తే ఇబ్బంది కలుగుతుందని వాదించిన ప్రాసిక్యూషన్ లాయర్ తో కోర్టు ఏకీభవించింది.

డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో ఈనెల 8న సంజన ఇంట్లో సోదాలు జరిపారు సెంట్రల్ క్రైమ్ బ్రాండ్ (సీసీబీ) అధికారులు. అదే రోజు సంజనాను అరెస్ట్ చేశారు. అంతకంటే ముందే రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. కోర్టు ఆదేశాల మేరకు వాళ్లందర్నీ రిమాండ్ లో ఉంచారు. మిగతా వాళ్ల బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 30న జరగనుంది.

Related Stories