అందరికీ నచ్చే సర్కారు పాట: పరశురామ్

Parasuram

‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా పెద్ద దర్శకుడిగా మారిపోయారు పరశురామ్. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసే అవకాశం తెచ్చిపెట్టింది ఆ మూవీ. మహేష్ బాబుతో పరశురామ్ తీసిన ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదల కానుంది. ఆయనతో ఇంటర్వ్యూ…

‘సర్కారు వారి పాట’ ఎలా మొదలైంది?

‘గీత గోవిందం’ చేస్తున్నప్పుడే ‘సర్కారు వారి పాట’ కథ మెదిలింది. మహేష్ బాబు అవకాశం ఇవ్వడంతో ఆయనని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ పూర్తి చేశాను. మహేష్ బాబుకి కథతో పాటు హీరో పాత్ర తీర్చిన విధానం నచ్చింది. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. పూర్తిస్థాయి వినోదం ఉంటుంది. ఒక మీడియం రేంజ్ దర్శకుడికి మహేష్ బాబు ఛాన్స్ఎందుకు ఇచ్చాడని ఇండస్ట్రీలో చాలా మందికి డౌట్. సినిమా చూస్తే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి.

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన విజయమాల్య వంటి వారిని చూసి ఈ కథ రాసుకున్నారా?

మహేష్ బాబు బ్యాంక్ ఎంప్లాయ్ కాదు. ఒక వ్యక్తి గురించి కానీ వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఈ కథ లో లేదు. బలమైన కథ, సరదా కథనం ఉంటుంది.

సినిమాలో కొన్ని నాటు డైలాగులు కూడా చెప్పించినట్లున్నారు?

కథలో హీరో పాత్ర తీరు అలా వుంటుంది.

కీర్తి సురేష్ ని తీసుకోవడానికి కారణం?

ఈ పాత్రకి కీర్తి సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. సినిమా చూసిన తర్వాత హీరోయిన్ గా కీర్తిని ఎందుకు పెట్టుకున్నామో అందరికీ అర్ధమౌతుంది. కథతో ముడిపడిన పాత్ర. పాటల కోసమో, రొమాంటిక్ సీన్ల కోసమో సృష్టించిన పాత్ర కాదు.

ఈ కథ మొదట అల్లు అర్జున్ కి చెప్పారా?

ఇది మహేష్ బాబు గారి కోసం పుట్టిన కథ. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఆ డ్రీం తీరిందిప్పుడు.

సర్కారు వారి పాటని పోకిరితో పోల్చుతున్నారు?

పోకిరి ఒక అండర్ కాప్ బిహేవియర్. సర్కారు వారి పాట ఒక కామన్ మాన్ బిహేవియర్. ఇందులో ఇంకాస్త ఓపెన్ అవుతారు. మ్యానరిజమ్స్, లుక్స్ , బాడీ లాంగ్వెజ్.. చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతారు.

‘నేను విన్నాను.. నేను వున్నాను’ డైలాగ్ గురించి చెప్పండి?

నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్. చాల గొప్ప మాటని సింపుల్ గా చెప్పేశారు. ‘సర్కారు వారి పాట’లో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ గారు ఆ డైలాగు చెప్పారు.

డైలాగ్ రైటింగ్ లో ఎవరు స్ఫూర్తి?

మా గురువు గారు పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ గారి రచనలు ఇష్టం.

మహేష్ బాబు కూతురు సితార సినిమాలో నటించారా?

లేదండీ. ప్రమోషనల్ సాంగ్ కోసం చేశాం. ఇది తమన్ ఐడియా. మహేష్ బాబు గారిని అడిగితే ఓకే అన్నారు.

తర్వాతి చిత్రం?

నాగ చైతన్య హీరోగా ఉంటుంది.

 

More

Related Stories