
మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా అనుకున్న తేదికి వస్తుందా, రాదా అని మొన్నటివరకు అభిమానులు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొత్తం పూర్తయింది.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో రీసెంట్ గా మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్ లపై మాస్ సాంగ్ ని చిత్రీకరించారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు, సినిమా ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మే 12న విడుదల చేస్తామని నిర్మాతలు ఇంతకుముందు ప్రకటించారు. అదే తేదీన రానుంది సినిమా. ఎటువంటి వాయిదాలు లేవు.
మహేష్ బాబు ఈ సినిమాలో లోన్లు రికవరీ చేసే వ్యక్తిగా కనిపిస్తారు. అందుకే, సినిమా పోస్టర్లలో తాళాలు, గంటలు చూపిస్తున్నారు. ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకి డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వచ్చే నెలలో విడుదల కానున్న భారీ తెలుగు చిత్రం ఇది.