
రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు… సత్యదేవ్. ఈ సినిమాకి మంచి కాంప్లిమెంట్స్ రావడంతో … తన కోరికల లిస్ట్ బయట పెట్టాడు.
కమల్ హాసన్ నటించిన “సాగరసంగమం” సినిమాను సత్యదేవ్ చేస్తే ఎలా ఉంటుంది.. చిరంజీవి నటించిన “ఆపద్బాంధవుడు” సినిమాను సత్యదేవ్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది… జనాలు ఇలా ఊహించుకోకపోవచ్చు కానీ ఈ నటుడికి మాత్రం ఇలాంటి కోరికలున్నాయి. తనకు అలాంటి సినిమాల్లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు ఈ నటుడు.
“నాకు డ్రీమ్ రోల్స్ ఉండవు. డ్రీమ్ కథలున్నాయి. నాకు ‘సాగరసంగమం’, ‘ఆపద్బాంధవుడు’ లాంటి సినిమాలు చేయాలని ఉంది. ఆ రెండు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ‘నాయకుడు’, ‘బాహుబలి’ సినిమాలు ఇష్టం. ఇలాంటి సినిమాలు చేయాలనే కోరిక ఉంది.”
డిఫరెంట్ పాత్రలు పోషించడమే తన లక్ష్యం అంటున్నాడు. “రాగల 24 గంటల్లో” మూవీలో విలన్ పాత్ర పోషించినా.. “బ్రోచేవారెవరురా” సినిమాలో ఔత్సాహిక దర్శకుడి పాత్ర పోషించినా.. అంతా కొత్తదనం కోసమే అని చెబుతున్నాడు. ఉదయం 5 గంటలకు లేచి సెట్స్ కు వెళ్లాలనే ఉత్సాహం కలగాలంటే ఇలాంటి పాత్రలు చేయాలంటున్నాడు.