
హీరో సత్యదేవ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరోగా చేతిలో సినిమాలున్నాయి. పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తూ కెరీర్ ని వైవిధ్యంగా నడుపుకుంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం… కృష్ణమ్మ.
సత్యదేవ్ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా ‘కృష్ణమ్మ’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సత్యదేవ్ కత్తి పట్టుకొని నిల్చున్న వైనం చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువే అనుకోవాలి. పగ, ప్రేమ కలయికతో కథ సాగుతుందట.
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీవీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.