
ఒకప్పుడు సినిమా పోస్టర్ల పేరుపై ఎక్కువగా కనిపించిన సంతకం… ఈశ్వర్. కళాత్మకమైన పోస్టర్లకు పెట్టింది పేరు ఈశ్వర్. మన తెలుగు రాష్ట్రాల్లో దుకాణాల్లో ఎక్కువగా కనిపించే కృష్ణుడిగా ఎన్టీఆర్ నిలువెత్తు రూపంలో ఉన్న ఫోటో ఆయన సృష్టించిందే. ఆయన ఇక లేరు. సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో కన్ను మూశారు.
ఈశ్వర్ పేరుతో, ఆ సంతకంతో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన పేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం.
ఆయన తొలి చిత్రం.. బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ (1967). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన పోస్టర్స్ తీర్చిదిద్దారు. దాదాపు 2600లకు పైగా చిత్రాలకు పని చేసినట్లు అంచనా. కోడి రామకృష్ణ తీసిన ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన ఆఖరి చిత్రం.
‘సినిమా పోస్టర్’ పేరుతో ఆయన పుస్తకం కూడా తెచ్చారు. దానికి నంది పురస్కారం లభించింది. అలాగే, 2015లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనని సత్కరించింది.
