
దర్శకుడు శంకర్ ‘కథల’ సమస్య ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు చాలా వరకు తానే స్టోరీలైన్లు రాసుకున్నారు శంకర్. ఐతే, 30 ఏళ్ల కెరీర్, వయసు కారణంగా ఆయనకి ‘కొత్త ఐడియాల’ ఇబ్బంది మొదలైంది. అందుకే, ‘భారతీయుడు 2’కి సీక్వెల్, ‘అపరిచితుడు 2’కి సీక్వెల్ తీస్తున్నారని ఆ మధ్య కామెంట్స్ వచ్చాయి.
‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఐతే, ‘అపరిచితుడు 2’ని మాత్రం పక్కన పెట్టారట. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ‘అపరిచితుడు 2’ ని అనుకున్నారు. కానీ, ‘అపరిచితుడు’ రీమేకో, సీక్వెలో కాకుండా మరో కథతో రణ్వీర్ తో మూవీ తీయాలనుకుంటున్నారట.
తమిళంలో పేరొందిన ‘వేల్పరి’ అనే ఒక రాజు కథ ఆధారంగావచ్చిన నవలని సినిమాగా తీద్దామనుకుంటున్నారట. ఇటీవల మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవలని సినిమాగా తీసి విజయం సాధించారు. ఆ స్పూర్తితో శంకర్ మరో తమిళ నవలని హిందీలో తీసే ప్లాన్ లో ఉన్నారు అని మీడియా టాక్.

శంకర్ అటు ‘భారతీయుడు 2’తో పాటు ఇటు రామ్ చరణ్ హీరోగా కూడా ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథని తీసుకున్నారు. శంకర్ ఇప్పుడు తన కథల మీద ఆధారపడకుండా ఇతరుల స్క్రిప్ట్ లు తన పద్దతిలో అల్లుకుంటున్నారు అన్నమాట.