
శృతి హాసన్ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. కరోనా కి ముందు అవకాశాల్లేవు. కానీ కరోనా అనంతరం ఆమె బిజీ అయిపొయింది. పెద్ద సినిమాలు వళ్ళో వచ్చిపడ్డాయి. ఒకేసారి మూడు పెద్ద సినిమాల్లో నటిస్తోంది ఈ సుందరి. దాంతో, ఇప్పుడు దర్శకులను కాకాపడుతోంది మరిన్ని అవకాశాల కోసం.
తెలుగులో ఆమె నటిస్తున్న అతి పెద్ద చిత్రం… సలార్. ప్రభాస్ సరసన ఆమె నటిస్తోంది ఇందులో. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఇప్పుడు దేశంలో రాజమౌళికి సమానంగా క్రేజ్ ఉంది. ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రశాంత్ నీల్ ని తెగ పొగిడేస్తోంది శృతి. నీల్ ఒక బ్రాండ్ అని చెప్తోంది. జేమ్స్ కామెరూన్ లా ప్రశాంత్ నీల్ తనదైన ఒక ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తాడని ప్రశంసలు కురిపిస్తోంది.
ఆమె పొగడుతున్న తీరు కాకా పడుతున్నట్లుగా ఉంది అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఐతే, ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకొంది. ‘సలార్’ కూడా ‘కేజీఎఫ్ 2’లా దేశమంతా సంచలన విజయం సాధిస్తే ఆమె టాప్ హీరోయిన్ గా మరోసారి హల్చల్ చెయ్యొచ్చు. అందుకే, ఈ పొగడ్తలు.
‘క్రాక్’ సినిమా హిట్ కావడంతో శృతికి ఈ సినిమాలో అవకాశం వచ్చింది.

‘సలార్’ కాకుండా చేస్తున్న ఇతర చిత్రాలు… బాలకృష్ణ – గోపీచంద్ మలినేని మూవీ, చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’. అన్నీ మాస్ చిత్రాలే కావడం విశేషం. 36 ఏళ్ల ఈ సుందరి ఒకవైపు సీనియర్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు ప్రభాస్ వంటి పెద్ద హీరోతో మూవీ చేస్తోంది.