సార్, వారసుడు తమిళ చిత్రాలే!

ఆగస్టు 1 నుంచి షూటింగులు బంద్ చెయ్యాలని ప్రతిపాదించింది యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఈ గిల్డ్ లో యాక్టివ్ గా ఉన్నవాళ్ళలో నిర్మాత దిల్ రాజు, నిర్మాత నాగ వంశీ ఉన్నారు. ఐతే, వీళ్లు నిర్మిస్తున్న రెండు చిత్రాల షూటింగులు కొనసాగుతున్నాయి. అవి ఏ చిత్రాలు అంటే… తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘వారసుడు’ (తమిళంలో పేరు ‘వరిసు’), ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ (తమిళంలో ఈ సినిమా పేరు ‘వాతి’).

మొన్నటివరకు విజయ్ నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం అని, ధనుష్ తొలి తెలుగు చిత్రమని ఈ నిర్మాతలు ప్రకటించుకున్నారు. కానీ, ఇప్పుడు షూటింగుల బంద్ విషయానికి వచ్చేసరికి అవి తమిళ చిత్రాలని, వాటికి బంద్ రూల్ వర్తించదని మాట వినిపిస్తోంది. విమర్శలు ఎక్కువ కావడంతో ‘వారసుడు’, ‘సార్’ తమిళ చిత్రాలే అని ప్రకటించారు. తెలుగులో కేవలం డబ్ అవుతున్నాయట.

ఇదే మాట మీద వీళ్ళు ఉంటారా? ఎందుకంటే ఈ సినిమాల విడుదల సమయంలో మళ్ళీ విజయ్ మొదటి తెలుగు చిత్రమని, ధనుష్ తొలి తెలుగు మూవీ అని కచ్చితంగా ప్రచారం చేస్తారు.

‘వారసుడు’ (‘వరిసు’) చిత్రానికి దర్శకుడు (వంశీ పైడిపల్లి), నిర్మాత తెలుగువారే. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ (‘వాతి’) చిత్రానికి దర్శకుడు (వెంకీ అట్లూరి), నిర్మాత కూడా తెలుగు వాళ్లే. అంటే, వీళ్ళు తమిళ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారని అనుకోవాలి. ఆ తమిళ హీరోలు తెలుగులోకి అడుగుపెడుతున్నారని భావించొద్దు అన్నమాట.

 

More

Related Stories