స్కంద – తెలుగు రివ్యూ

Skanda

ఒక్కడే ఉంటాడు, అన్నీ చేస్తాడు, డైలాగులు అతడే చెబుతాడు. ఫైట్స్ అతడే చేస్తాడు. చివరికి ప్రభుత్వాన్ని కూడా ఒక్కడే ఎదిరిస్తాడు. అడుగడుగునా బీభత్సమైన ఫైట్స్ తో బెదరగొడతాడు. బోయపాటి సినిమాల్లో హీరోల కామన్ లక్షణాలివి. ఇవన్నీ “స్కంద”లో కూడా ఉన్నాయి ఈసారి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలు, రెండు వ్యవస్థలను హీరో ఢీ కొంటాడు. డబుల్ యాక్షన్ ఓకె కానీ డబుల్ ఫన్ మాత్రం ఉండదు…

మామూలుగానే తెలుగు సినిమాల్లో లాజిక్స్ ఉండవు. ఇక బోయపాటి సినిమాల్లో టి కోసం వెదకడం మూర్ఖత్వం అవుతుంది. కేవలం లాజిక్స్ నే కాదు, మన బుర్రను కూడా ఇంట్లో పెట్టి ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. ఇటీవల ఇంత ఇల్లాజికల్ సినిమా రాలేదంటే నమ్మండి. మేటర్ లోకి వెళ్లేముందు, అసలు ఈ స్కందలో స్టోరీలైన్ ఏంటో చూద్దాం..

ఇటు ఏపీ ముఖ్యమంత్రి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ సీఏం కొడుకు, ఏపీ సీఏం కూతుర్ని లేపుకుపోతాడు. అక్కడ మొదలవుతుంది ఇద్దరు సీఎంల మధ్య రగడ. వ్యవస్థల్ని వదిలేసి ఓ కిరాయి రౌడీని మాట్లాడుకుంటాడు ఏపీ సీఏం. తెలంగాణ సీఎంను చంపి, తన కూతుర్ని తీసుకురమ్మంటాడు. తెలంగాణ సీఎం కూతురి ద్వారా అతడి ఇంట్లోకి వెళ్లిన హీరో, భారీ యుద్ధం చేసి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లను కిడ్నాప్ చేస్తాడు.

ఓవైపు కథ ఇలా నడుస్తుంటుంది. మరోవైపు ఓ పెద్ద ఐటీ పారిశ్రామికవేత్త ఉంటాడు. అతడు అకారణంగా జైళ్లో మగ్గుతుంటాడు. అతడి కూతురు హాస్పిటల్ మంచంపై అచేతనంగా పడి ఉంటుంది. ఈ రెండు థ్రెడ్స్ ను హీరో కలుపుతాడు. ఇంతకీ హీరో ఎవరు? ఇద్దరు సీఎంల కూతుళ్లను ఏం చేశాడు? క్లయిమాక్స్ ఏంటనేది స్కంద కథ.

ఇంత ఊరమాస్ సినిమాను రామ్ ఇప్పటివరకు చేయలేదు కాబట్టి. పైగా ఇందులో రామ్ 3 షేడ్స్ లో కనిపించాడు. తెలంగాణ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా, అమెరికాలో జాబ్ వదిలేసి, ఆంధ్రాలోని ఓ గ్రామంలో ఉండే కుర్రాడిగా, కల్ట్ రాయలసీమ వ్యక్తిగా.. ఇలా 3 షేడ్స్ పోషించాడు. అయితే ఎన్ని రోల్స్ పోషించినా, ఎన్ని షేడ్స్ చూపించినా బోయపాటి హీరో ఒకేతీరుగా ఉంటారు. ఒకే తీరుగా కనిపిస్తారు. బోయపాటి హీరోలు కండలు పెంచి ఫైట్లు చేయాలి, ఓవర్ గా నటించాలి. ఈ మూడు పనుల్ని రామ్ సమర్థవంతంగా పోషించాడు.

రామ్ కు మాస్ సినిమాలు కొత్త కాదు. “ఇస్మార్ట్ శంకర్”తో మాస్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడీ “స్కంద”తో ఆయన ఊరమాస్ కూడా చెయ్యగలను అని చూపించే ప్రయత్నం చేశాడు.

బోయపాటి ఈసారి కథ కథ కోసం ఎక్కువ శ్రమ పడలేదు. తన సినిమాలనే తిప్పేసి, రీసైకిల్ చేసి, టెంప్లెట్ స్క్రీన్ ప్లే పరిచారు.

సీన్లు కొత్తగా తీయాలి లేదా కథనం కొత్తగా ఎంత రసవత్తరంగా చెప్పాలి అనేదాని మీద కాకుండా… ఫైట్ లు ఎంత గ్రాండ్ గా తీయాలి అనేదానిపైనే బోయపాటి శ్రద్ద పెట్టినట్లు ఉన్నారు. అందుకే స్కందలో ఫైట్స్ ఎక్కువ, మేటర్ తక్కువ అయింది. ఇంకా చెప్పాలంటే, ఫైట్స్ మధ్య కథను ఇరికించినట్టయింది. 2 గంటల 47 నిమిషాల ఈ సినిమాలో ప్రీ-క్లయిమాక్స్, క్లయిమాక్స్ పార్ట్ ను వివరంగా చెప్పొచ్చు. కథతో పాటు అక్కడ ఎమోషన్ పండించొచ్చు.

సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా సిల్లీగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఓ గంట సేపు ఎదో ఉందిలే అని చూసేలా చేస్తుంది. దాంతో టర్వెల్ పడి పోతుంది. పోనీలే ఇంటర్వెల్ తర్వాతైనా ఎంజాయ్ చేద్దామనే ఆశతో తిరిగొచ్చి కుర్చీలో కూర్చంటే, ఆ మాత్రం ఆనందం కూడా దక్కనివ్వడు బోయపాటి. ఈ సినిమాలో వాళ్ళు ముఖ్యమంత్రులా, ఫ్యాక్షనిస్టులా అన్నట్టుంటారు.

ఎక్కడా లాజిక్ ఉండదు. ముఖ్యమంత్రులు కూడా ఎవడో వచ్చి అన్ని పేల్చేస్తే భయపడి చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి ఇంటికి హీరో వచ్చి అతని కూతురు (శ్రీలీల)ని హెలికాఫ్టర్ లో తీసుకుపోతాడు. ఇక మరో హీరోయిన్ సాయి మంజ్రేకర్ మొరాకోలో 30 మందిని చంపిన ఒక క్రిమినల్ ని (అతను కూడా హీరో రామ్ నే) ప్రేమిస్తుంది. ఆమె పెద్ద కంపెనీకి సీఈవో, కానీ అతి క్రూరంగా, మొరటుగా కనిపించే వాడిని ప్రేమిస్తుందట. ఇంతకీ మొరాకోలో 30 మందిని లేపిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ కథ తెలియాలంటే మనం పార్ట్ 2 చూడాలట. అట్లుంటది మరి బోయపాటి చిత్రం.

బోయపాటి ప్రతి సినిమాలో ఉన్నట్టుగానే స్కందలో కూడా లెక్కలేనంత ప్యాడింగ్ ఉంది. అలనాటి నటి గౌతమి కూడా ఉన్నారు. కానీ వాళ్లెవ్వరికీ సరైన పాత్రల్లేవు, సీన్లు లేవు. బాధాకరమైన విషయం ఏంటంటే.. హీరోయిన్ కు కూడా రోల్ లేదు. థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఒక్క పాత్ర పేరు కూడా గుర్తుకురాలేదంటే బోయపాటి ఫైట్స్ తో సినిమాను ఎంతలా నింపేశాడో అర్థం చేసుకోండిక.

టెక్నికల్ గా చెప్పుకోవాల్సి వస్తే, మొత్తం క్రెడిట్ ను ఫైట్ మాస్టర్లకు ఇవ్వాలి. ఈ సినిమాను దాదాపు 70శాతం వాళ్లే నడిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ” అఖండ”కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, స్కంద విషయంలో మాత్రం చేతులెత్తేశాడు. ఒక్కపాట మినహా సాంగ్స్ కూడా బాగాలేవు. రామ్ నటన, అక్కడక్కడా పొలిటికల్ డైలాగ్స్ మాత్రం బాగున్నాయి.

ఓవరాల్ గా “స్కంద” సినిమా బోయపాటి మార్క్ ఫైట్స్, ఎలివేషన్స్, ఆయుధాలతో నిండిపోయింది. లాజిక్, మేజిక్ ఆశించొద్దు.

Rating: 2.5/5

By M Patnaik

Advertisement
 

More

Related Stories