
కూచిపూడి నృత్యకారిణి సౌజన్యా శ్రీనివాస్ (దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి), ఆమె బృందం ప్రదర్శించిన ‘మీనాక్షి కల్యాణం’ అనే నృత్య రూపకానికి వేదిక అయ్యింది హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూపకాన్ని సమర్పించాయి. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, సీనియర్ నటుడు-రచయిత తనికెళ్ల భరణి, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, మామిడి హరికృష్ణ (తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్), సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వసంతలక్ష్మి నరసింహాచారి, సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు.
భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం) రచించిన ఈ నృత్య రూపకానికి పేరుపొందిన నాట్యకారుడు పసుమర్తి రామలింగశాస్త్రి నృత్యాలు సమకూర్చగా, డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు. మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం వెనుక ఉన్న అద్భుతమైన గాథను ఈ రూపకం ద్వారా ప్రదర్శించారు. పార్వతిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన భక్తురాలు విద్యావతికి పుట్టిన మీనాక్షిగా సౌజన్యా శ్రీనివాస్ ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి దర్శకత్వంలో సౌజన్య కళాకారుల బృందం చక్కటి హావభావాలతో నృత్యం చేసి కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేశారు. మీనాక్షి పాత్రలో ఆమె అద్భుతమైన అభినయం చూపారు.
“సౌజన్యా శ్రీనివాస్ గారు ప్రదర్శించిన ‘మీనాక్షి కల్యాణం’ను స్టేజి మీద చూసే అవకాశం కలగడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. రచయిత భమిడిపల్లి నరసింహమూర్తి గారికీ, నాట్యకారులు పసుమర్తి రామలింగ శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీనాక్షి పాత్రలో సౌజన్య చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు అనిపించిందన్నారు. ఆ దేవుళ్లే మన ముందుకు వచ్చి నాట్యం చేశారా అనేటటువంటి అనుభూతి కలిగింది” అన్నారు పవన్ కల్యాణ్ .
“నాకు మీనాక్షి, సుందరేశ్వరస్వామి వార్ల కథ చాలా ప్రతీకాత్మకంగా అనిపించింది. చూసేవారి కళ్లని బట్టి సౌందర్యం ఉంటుందని చెప్పే చక్కని దృశ్య రూపకం ఇది. ఒకరి అంతర్గత సౌందర్యాన్ని మరొకరు గుర్తించగలిగితే, జీవితమే ఒక వేడుకలా అవుతుంది. నిజమేమంటే స్టేజి మీద నా జీవిత భాగస్వామి ప్రదర్శన ఇస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరిగా నేను ‘మీనాక్షి కల్యాణం’ను చూడటం. నా జీవితంలోని ఇద్దరు అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన పవన్ కల్యాణ్ గారు ఒకరు నా పక్కన కూర్చుంటే, ఇంకొకరు సౌజన్య స్టేజి మీద ఉన్నారు” అని చెప్పారు త్రివిక్రమ్.