బాలు పాట పంచామృతం

ఆయన గానం ఓ మేలుకొలుపు. ఆయన పాట ఓ జోలపాట. ఆయన గాత్రం ఉత్తేజభరితం. ఆయన గొంతు మనసుకు పులకింత. తెలుగు ప్రేక్షకుడికి తన గాత్రంతో నవరసాల్ని అందించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా.. ఆయన జీవితంలో ఎన్నో మేలిమలుపు, మరెన్నో మధుర జ్ఞాపకాలు.

Advertisement

నెల్లూరులోని అచ్చ తెలుగు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బాలు. తండ్రి సాంబమూర్తి హరికథలు చెబుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ రక్తమే బాలులో కూడా ప్రవేశించింది. ఆ గాత్రమే ఆయనకు వరంగా మారింది. అయితే ఈ విషయాన్ని తండ్రి గ్రహించలేదు. తనలా తనయుడు జీవితంలో కష్టాలు పడకూడదని భావించి, తను కష్టపడి బాలును ఇంజినీరింగ్ చదివించారు. కానీ బాలు మనసు మాత్రం గానం పైనే ఉండేది.

ఓవైపు తన తెలివితేటలతో సబ్జెక్టులు పూర్తిచేస్తూనే, మరోవైపు తన గానంతో కప్పులు గెలిచేవారు. బాలు అవస్థలు గమనించిన తండ్రి ఓ రోజు తను చెప్పాలనుకున్నది చెప్పేశారు. చదువు పూర్తిచేసి ఇంజనీరింగ్ అయినా చేయమని లేదా చదువు ఆపేసి సినిమాల్లోకైనా వెళ్లిపోమని చెప్పేశారు. దీంతో బాలు తనకిష్టమైన సినిమా రంగంవైపు మళ్లారు. అయితే అద్భుతమైన గాత్రం ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు.

ఓ కాంపిటిషన్ లో జానకమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో సినీరంగం వైపు అడుగులు వేసిన బాలుకు ప్రారంభంలో ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. అప్పటికే ఘంటశాల పీక్ స్టేజ్ లో ఉండడం, పైగా ఆయన్ను కాదని మరో వ్యక్తితో పాడించడం లాంటి సాహసం చేయడానికి ఇష్టంలేక అంతా బాలును దూరంపెట్టారు. అలాంటి టైమ్ లో బాలు గాత్రం నచ్చి కోదండపాణి తొలి అవకాశం ఇచ్చారు. తన సినిమా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నతో పద్మనాభం, ఎస్పీ బాలును ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

అయితే ఈ సినిమా కంటే ముందు బాలు పాటలు పాడిన కాలచక్రం అనే డబ్బింగ్ సినిమా రిలీజైంది. తొలి పాట పాడింది శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలోనే అయినప్పటికీ, రిలీజైన తొలి సినిమా మాత్రం కాలచక్రం.

అలా మెల్లగా కెరీర్ ప్రారంభించిన బాలు, 1970నాటికి మంచి పేరు తెచ్చుకున్నారు. శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకున్నారు. ఒక దశలో తన సినిమాల్లో బాలు మాత్రమే పాడాలని కృష్ణ పట్టుబట్టారంటే బాలు క్రేజ్ అర్థంచేసుకోవచ్చు. ఇక అక్కడ్నుంచి బాలు తన కెరీర్ లో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్ జమానా నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తరం వచ్చినా బాలు గాత్రానికి డిమాండ్ మాత్రం తగ్గలేదు. చివరికి హీరోల్లో మూడో తరం ప్రవేశించినా, సింగింగ్ లో బాలు క్రేజ్ మాత్రం తగ్గలేదు.

సౌత్ లోని అన్ని భాషలతో పాటు ఏకంగా 16 భాషల్లో పాటలు పాడి శభాష్ అనిపించుకున్నారు బాలసుబ్రమణ్యం. ఇప్పటివరకు 40వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించారు. ఒక దశలో వివిధ భాషల్లో పాటలు పాడడం కోసం ఆయన ఏకంగా హెలికాప్టర్ లోనే ప్రయాణాలు సాగించారంటే.. బాలు ఎంత బిజీగా గడిపారో అర్థం చేసుకోవచ్చు.

తన కెరీర్ లో ఏకంగా 6 సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు బాలు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది అవార్డులు అందుకున్నారు. ఇక మిగతా భాషల్లో అందుకున్న అవార్డులకు లెక్కలేదు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు తోపాటు కేంద్రం ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.

సౌత్ లో ఎస్పీ బాలుతో మ్యూజిక్ డైరక్టర్లకు ఏర్పడిన కాంబినేషన్లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలు-ఇళయరాజా, బాలు-రమేష్ నాయుడు, బాలు-కోదండపాణి, బాలు-చక్రవర్తి కాంబినేషన్లు సూపర్ హిట్. మరీ ముఖ్యంగా బాలు-ఇళయరాజా కాంబోలో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్. టాలీవుడ్-కోలీవుడ్ లో ఆ పాటల్ని ఆణిముత్యాలుగా అభివర్ణిస్తారు.

ఒక దశలో కెరీర్ పరంగా తనకుతాను స్వీయనిర్బంధం విధించుకున్నారు బాలు. కొత్త గాయకుల్ని పరిచయం చేసే ఉద్దేశంతో తను పాటలు పాడడం తగ్గించేశారు. తన మనసుకు నచ్చిన పాటల్ని మాత్రమే పాడారు. అది కూడా సంగీత దర్శకుడు ముందే ట్యూన్, లిరిక్స్ పంపిస్తే..  అది చూసి నచ్చితే స్టుడియోకు వచ్చేవారు. ఇప్పటితరం సంగీతం దర్శకులైన తమన్, దేవిశ్రీ లాంటి వాళ్లు తమ సినిమాల్లో బాలుతో కనీసం ఒక్క పాటైనా పాడించాలని ఉవ్విళ్లూరుతారు. దటీజ్ బాలు.

తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా ఉన్నంత కాలం బాలు బతికే ఉంటారు. తన పాటలతో అందర్నీ అలరిస్తూనే ఉంటారు. బాలు లివ్స్ ఆన్.. 

By: MK

Advertisement
 

More

Related Stories