SR కళ్యాణమండపం – తెలుగు రివ్యూ

SR Kalyanamandapam

కొత్తగా కథ రాసేవాడు అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసేయాలని చూస్తాడు. అతడే స్క్రీన్ ప్లే కూడా రాసినట్టయితే ఇక అన్ని మసాలాలు దట్టించేయాలని చూస్తాడు. వీటికితోడు అతడే హీరో కూడా అయితే ఇంకేముంది… హీరోయిజం కూడా పీక్స్ లో ఎలివేట్ అయిపోతుంది. ఈ ప్రయత్నంలో అసలు సోల్ మాయమైపోతుంది. “SR కళ్యాణమండపం” సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.

ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమాకు కథ కిరణ్ అబ్బవరం. ఈ సినిమాకు డైలాగ్స్ కిరణ్ అబ్బవరం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కిరణ్ అబ్బవరం. ఇంతకీ ఎవరు ఇతను? రెండేళ్ల క్రితం “రాజావారు రాణీవారు” అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ సబ్బవరం. రెండో సినిమాకే ఇన్ని బాధ్యతల్ని భుజానేసుకున్న ఈ హీరో.. యాక్టింగ్ కు తప్ప రైటింగ్ కి న్యాయం చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు కిరణ్ లో ”హీరో” డామినేట్ చేసిన విషయం తెలుస్తూనే ఉంది.

ఓ స్క్రిప్ట్ రైటర్ కు తన కథేంటి, తాను ఏం చెప్పదలుచుకున్నాడో అనే అంశంపై క్లారిటీ ఉండాలి. అప్పుడే కథనం సజావుగా సాగుతుంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, వాళ్ల సమస్యలతో కథ నడుస్తుంది. మధ్యలో తండ్రితో ఉన్న మనస్పర్దను అక్కడక్కడ చూపించినా అదే మెయిన్ పాయింట్ అనే విషయాన్ని చివరిదాకా దాచడం ఎఫెక్టివ్ గా లేదు.

ఎప్పుడైతే కల్యాణమండపం ఎలిమెంట్, తండ్రి అప్పులు తెరపైకొస్తాయో అప్పుడు మాత్రమే తండ్రికొడుకుల ఎలిమెంట్ తెరపైకొస్తుంది. అప్పటివరకు దీన్నొక లవ్ సినిమాగా చూసిన ప్రేక్షకుడికి, తండ్రికొడుకుల ఎలిమెంట్ ఫోర్స్ డ్ గా వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే కిరణ్, సాయికుమార్ తమ నటనాచాతుర్యంతో ఆ లోటును పైకి కనిపించకుండా బాగానే మేనేజ్ చేయగలిగారు. స్క్రీన్ ప్లే దోషాలు మాత్రం జాతకాన్ని మార్చేశాయి. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలు, కోపతాపాల్ని డీటెయిల్డ్ గా చెప్పిన ఈ సినిమాలో.. తండ్రికొడుకుల మధ్య అగాధం ఎందుకు ఏర్పడిందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా డీల్
చేయలేకపోయారు. సినిమాకు అదే మెయిన్ థీమ్ అనుకున్నప్పుడు దానిపై ఫోకస్ పెట్టకుండా వదిలేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే కిరణ్, సాయికుమార్ గురించి ఆల్రెడీ చేప్పేసుకున్నాం. హీరోయిన్ తో సహా మిగతా నటీనటులంతా అలా నటించారంతే. ప్రియాంక జవల్కర్ తన స్టైలింగ్ ని చూసుకోవాలి. ఇన్ స్టాగ్రామ్ లో సోకుల షోతో అదరగొట్టే ఈ భామ వెండితెరపై అలా ఎందుకు కనిపిస్తోందో.

టెక్నికల్ గా చూసుకుంటే చైతన్ భరధ్వాజ్ పాటలు రిలీజ్ కు ముందే హిట్టయ్యాయి. తెరపై ఇంకా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. శ్రీధర్ గాదె డైరక్షన్, ఎడిటింగ్ లో స్పార్క్ మిస్సయింది. ఎడిటర్ దర్శకుడు ఐతే ఇదే సమస్య…కత్తిరింపులు పట్టించుకోరు. “ఎస్ఆర్ కల్యాణమండపం” చుట్టూ కథ తిప్పి, ఆ కళ్యాణమండపాన్ని, పెళ్లిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు.

రివ్యూ ముగించేముందు కథను మూడు ముక్కల్లో చెప్పుకుందాం. హీరో-హీరోయిన్లు ప్రేమించుకుంటారు, హీరోయిన్ తండ్రి ఒప్పుకోడు. మరోవైపు హీరోకు, అతడి తండ్రికి మధ్య మనస్పర్థలు. ఇద్దరూ మాట్లాడుకోరు. తాతల కాలం నుంచి వస్తున్న కళ్యాణమండపాన్ని తండ్రి పాడుచేశాడని హీరోకు కోపం. అటు లవ్, ఇటు ఫ్యామిలీని హీరో ఎలా సెట్ చేశాడనేది స్టోరీ.

ఫైనల్ గా సినిమాలో ఎన్నో సమస్యలున్నా, ఎంతో భారంగా తోచినా… కిరణ్, సాయికుమార్ పెర్ఫార్మెన్స్, పాటలు ఈ సినిమాలో హైలెట్ అయ్యాయి

బాటమ్ లైన్ – కళ్యాణమండపానికి కళ తగ్గింది
రేటింగ్ – 2.5/5

Advertisement
 

More

Related Stories