లేడీస్ టైలర్ నుంచి పాటల స్రవంతి

Sirivennela and Sravanthi Ravikishore

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా యవనికపై కురిపించిన వెన్నెల సంతకాలెన్నో. పలువురు దర్శకులు, నిర్మాతలకు ఆయన ఆస్థాన కవి. ఆయన తొలి చిత్రం… ‘సిరివెన్నెల’. ఆ తర్వాత రాసిన తొలి బ్యాచ్ చిత్రాల్లో ఒకటి… లేడీస్ టైలర్. స్రవంతి రవికిశోర్ నిర్మించిన మూవీ అది.

‘లేడీస్ టైలర్’ నిన్న మొన్నటి ‘రెడ్’ వరకు ‘స్రవంతి సంస్థలో సుమారు 80 పాటలు రాశారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. శాస్త్రిగారితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రవికిశోర్.

“ఏం చెప్పాలో తెలియడం లేదు. మాటలకు అందని బాధ ఇది. అన్నయ్యతో అనుబంధం ఈనాటిది కాదు. నిర్మాతగా నా తొలి సినిమా ‘లేడీస్ టైలర్’లో అన్ని పాటలూ ఆయనే రాశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రి గారితో పరిచయం ఉంది.  అప్పటి నుంచి మా ప్రయాణం కంటిన్యూ అవుతోంది. బహుశా… ఏ నిర్మాతకూ రాయనన్ని పాటలు మా సినిమాలకు రాశాడని చెప్పొచ్చు. ‘మహర్షి’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘మావిచిగురు’, ‘ఎగిరే పావురమా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’, ‘గౌరీ’, ‘నేను శైలజ’, ‘రెడ్’… దాదాపుగా నేను నిర్మించిన అన్ని సినిమాల్లోనూ ఆయన పాటలు రాశారు.

ఎక్కడో ఒకటి అరా పాటలు వేరేవాళ్లు రాశారు తప్పితే… ఎక్కువ సినిమాలకు ఆయనదే సింగిల్ కార్డ్. స్రవంతి మూవీస్ సంస్థలో సుమారు 80 పాటల వరకూ రాసి ఉంటారు. ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్స్, రైటింగ్ సిట్టింగ్స్ కు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కో పాట రాయడానికి ఐదారు రాత్రులు కూర్చునే వాళ్ళం. ఇంకా ఏదో రాయాలని ఆయన పరితపించేవారు. ఇది వరకు… పాట అంటే నాలుగైదు సన్నివేశాల్లో చెప్పాల్సిన సారాన్ని చెప్పేవాళ్లం. అందులో ఆయన మేటి.

రామ్ హీరోగా నిర్మించిన ‘రెడ్’లో ఆయన పాటలు రాశారు. అప్పుడు డిసెంబర్ 2019లో ఆ పాటల కోసం రాత్రుళ్లు కూర్చున్నాం. ఆ తర్వాత కరోనా వచ్చాక కలవడం కుదరలేదు. నాకంటే ఆయన రెండు నెలలు పెద్దవారు. అందుకని, నన్ను ‘కుర్రకుంక’ అని సరదాగా అనేవారు. నేను రాముడు అని పిలిచేవాడిని. సాయంత్రం మా ఆఫీసుకు వస్తే సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఆయన ఆరోగ్యం గురించి మొన్న ఒకరితో మాట్లాడితే… త్వరలో ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఇంతలో ఇటువంటి విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు.”

 

More

Related Stories