శ్రీకారం హిట్ అవుతుంది: మెగాస్టార్

శర్వానంద్ హీరోగా వస్తోన్న కొత్త చిత్రం ‘శ్రీకారం’. మార్చి11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘శ్రీ‌కారం’ బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. రైటర్ సాయి మాధవ్ బుర్రా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదిత‌రులు పాల్గొన్నారు.

మెగాస్టార్ శర్వానంద్ ని మెచ్చుకున్నారు. “నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే రామ్ చరణ్‌తో పెరిగాడు… మరో రామ్ చరణ్. అయితే నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలీదు.. రామ్ చరణ్‌ను అడిగితే.. నాకు తెలీదు డాడీ అనేవాడు. ఓ సారి థమ్సప్ యాడ్ గురించి యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. ఎవరైతే బాగుంటుందా? అని అనుకునే సమయంలో.. శర్వానంద్ ఇంట్లో ఉన్నాడు.. నటిస్తావా? శర్వా అని అడిగితే.. అంకుల్ మీరు చెబితే చేస్తాను అన్నాడు.. ఆ మాట చాలు అని తీసుకెళ్లాను. అలా మేం ఇద్దరం వెళ్లి యాడ్‌లో నటించాం.. అదే మొదటి సారి కెమెరా ముందు కనిపించడం,” అని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

“శర్వానంద్ చాలా సాత్వికుడు. ఏదీ కూడా ఎక్కువగా చెప్పడు. మాట్లాడడు. అయితే శంక.ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ సాంగ్ సీన్‌లో కుర్రాడు కావాలి. ఎంతో అమాయకంగా కనిపించాలి. శర్వా అయితే బాగా చేస్తాడు అని అనుకున్నాను. నటిస్తావా? అని అంటే.. మీ సపోర్ట్ ఉంటే చేస్తాను అన్నాడు. అలా గెస్ట్ క్యారెక్టర్ చేశాడు. అప్పుడే నాకు అర్థమైంది.. పెద్ద హీరో అవుతాడని.. ఆ సీన్ తన నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చు. నాడే శర్వా నటనకు శ్రీకారం పడింది అక్కడే.. నటనకు తిలకం దిద్దింది కూడా నేనే,” అని చిరంజీవి అన్నారు.

‘శ్రీకారం’ మంచి సందేశంతో కూడిన కమర్షియల్ మూవీ ఇది అని అయన తెలిపారు. “వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ..ఈ సినిమాలో సందేశమే కాదు.. అన్ని రకాల కమర్షియల్ హంగులున్నాయి. సినిమా సినిమాకు పరిణతి కనిపిస్తూ.. శ్రీకారం సినిమాతో శర్వానంద్ మీ ముందుకురాబోతోన్నాడు.. సక్సెస్ కాబోతోందని సగర్వంగా చెబుతున్నాను..సమయం లేకపోవడంతో కొంత సినిమానే చూశాను. ఎంతో చక్కటి మెసెజ్.. కమర్షియల్ పంథాలో దర్శకుడు కిషోర్ అద్భుతంగా చెప్పారు. నేటి యువతరానికి వ్యవసాయ విలువ తెలిసేలా చూపించారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా అద్భుత విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను,” అన్నారు చిరంజీవి.

More

Related Stories