
శ్రీలీల ఇప్పటికే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. మిగతా ఏ హీరోయిన్ కి లేనన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి టాప్ హీరోలతో పాటు నితిన్, విజయ్ దేవరకొండ వంటి మిడ్ రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఆమెదే ఇప్పుడు హవా.
ఐతే, శ్రీలీల ఇప్పటివరకు నటిగా ప్రూవ్ చేసుకోలేదు. ఆమె నటించిన మూడు సినిమాల్లో కూడా గ్లామర్, డ్యాన్స్ పైనే ఫోకస్. “పెళ్లి సందD”లో డ్యాన్స్ తో పాపులర్ అయింది. “ధమాకా”లో గ్లామర్, డ్యాన్స్ హైలెట్. ఇక “స్కంద”లో ఆమెది రెగ్యులర్ మాస్ భామ పాత్ర. అది ఆడలేదు.
ఇప్పుడు “భగవంత్ కేసరి”లో పూర్తిగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర. ఇందులో బాలయ్యకి కూతురి వరసయ్యే అమ్మాయిగా నటించింది. సెంటిమెంట్ పాత్ర. శ్రీలీల పాత్ర సినిమాకి కీలకం.
“ఇది పూర్తిగా నటనకి స్కోప్ ఉన్న పాత్ర. నా కెరీర్ కి ఇది ఒక పెద్ద మలుపు. విజ్జి పాత్రని ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను,” అని శ్రీలీల పేర్కొంది. ఈ సినిమాలో ఆమె నటనని బట్టి ఆమెకి మున్ముందు పాత్రలు దక్కుతాయి. అందుకే “భగవంత్ కేసరి” ఆమెకి చాలా కీలకమైన మూవీ.