
శ్రీనిధి శెట్టి చాలా పెద్ద హీరోయిన్ గా స్థిరపడుతుంది అనుకున్నారు చాలామంది. ఆమె నటించిన మొదటి రెండు చిత్రాలు అలాంటివి మరి. “కేజీఎఫ్” ఆమెకి మొదటి చిత్రం. అది ఒక సంచలనం. దాని రెండో భాగం “కేజీఎఫ్ 2” దేశమంతా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అంత పెద్ద హిట్స్ అందుకున్న ఈ భామకి తెలుగు, తమిళ, హిందీ భాషల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు.
ఇక రెండో చిత్రంగా ఆమె తమిళ్ లో విక్రమ్ సరసన “కోబ్రా” అనే సినిమా చేసింది. అది ఆడలేదు. అంతే ఆమెకి అవకాశాలు మృగ్యం అయ్యాయి.
2018లో “కేజీఎఫ్” విడుదలైతే ఆమె ఇప్పటివరకు చేసిన చిత్రాలు మూడు మాత్రమే.దాదాపుగా ఆమె కెరీర్ ఎండ్ అయిందా అన్న అనుమానాలూ వచ్చాయి. సరిగ్గా ఇలాంటి టైములో ఇప్పుడు ఆమె రెండు సినిమాలు సైన్ చెయ్యడం విశేషం.
ALSO CHECK OUT: Srinidhi Shetty’s undying love for Sarees
శ్రీనిధి తాజాగా తెలుగులో అడుగుపెడుతోంది. ఆమె నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం… “తెలుసు కదా”. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరో. రాశి ఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కన్నడంలోనే సుదీప్ సరసన #కిచ్చా47 చిత్రం కూడా సైన్ చేసింది. ఇలా ఒకేసారి రెండు చిత్రాలు దక్కాయి. ఇన్నాళ్లకు ఆమె కెరీర్ లో బిజీ అవుతోంది.

“పెళ్లి సందD” వంటి చిత్రంతో శ్రీలీల అరడజను చిత్రాలు పొందితే, శ్రీనిధి “కేజీఎఫ్” వంటి రికార్డులు నెలకొల్పిన చిత్రాల్లో నటించి కూడా రెండు సినిమాలు సైన్ చేసేందుకు ఇన్నాళ్లూ ఆగాల్సి వచ్చింది.