
ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ చేయాలంటే రష్మి, సుడిగాలి సుధీర్ ఉండాల్సిందే. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అలాంటిది. వీళ్లతో ఓ డ్యూయట్ కు డాన్స్ చేయిస్తే చాలు టీఆర్పీ అమాంతం పెరిగిపోతుంది. జబర్దస్త్ కూడా అదే పని చేసింది. తన 300వ ఎపిసోడ్ కోసం వీళ్లిద్దరి కెమిస్ట్రీని మరోసారి బుల్లితెర నిండా పరిచేసింది.
జబర్దస్త్ సాక్షిగా మరోసారి రష్మిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు సుడిగాలి సుధీర్. తన విజయంలో ఆమెకు కూడా భాగమిచ్చాడు. రష్మి లేకపోతే తను లేనన్నాడు.
“నా స్కిట్స్ తో పాటు నాకు ఇంకా ఏదైనా పేరు వచ్చిందంటే దానికి కారణం రష్మి. సుధీర్ అంటే కొంతమంది గుర్తుపడతారేమో. అదే రష్మీసుధీర్ అంటే అంతా గుర్తుపడతారు. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉందంటారు. కానీ 8 ఏళ్లుగా నా విజయం నా వెనక కాదు, నా పక్కనే రష్మి రూపంలో ఉంది.”
ఇలా రష్మిపై తన ప్రేమను మరోసారి బయటపెట్టాడు సుడిగాలి సుధీర్. దీంతో రష్మి సిగ్గుతో ముడుచుకుపోయింది.