
కాంపీటీషన్ లేకుండా సోలోగా తన సినిమాని విడుదల చేసి మంచి వసూళ్లు రాబట్టుకుందామని సందీప్ కిషన్ ప్లాన్ చేస్తుంటాడు. కానీ పాపం, ఆయన ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకున్నా ఇతర సినిమాలు వచ్చి మీద పడుతుంటాయి. ఎప్పటికప్పుడు తన విడుదల తేదీలను మార్చుకోవాల్సి వస్తుంటుంది ఈ కుర్ర హీరోకి.
‘గల్లీ రౌడీ’ అనే కొత్త సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది.
సందీప్ కిషన్ నటించిన ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజ్ అనుకున్నారు. ఈలోపు థియేటర్లు తెరుచుకున్నాయి. దాంతో, సెప్టెంబర్ 3న తమ సినిమా విడుదల అవుతుంది ప్రకటించి…ఆ ప్రకారం పబ్లిసిటీ ప్లాన్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 3న గోపీచంద్ నటించిన ‘సీటిమార్’ వచ్చి పడింది. సెప్టెంబర్ 10న ‘లవ్ స్టోరీ’ కూడా విడుదల కానుంది.
దాంతో, ‘గల్లీ రౌడీ’కి సోలోగా వద్దామంటే చిన్న సందు కూడా దొరకట్లేదు. సెప్టెంబర్ 3న ఈ సినిమా రావడం లేదు. సినిమా వాయిదా పడింది.
కోన వెంకట్ సమర్పణలో జీ నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేసిన ‘గల్లీ రౌడీ’ వినోదాత్మక చిత్రం. నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.