
సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తానే బాక్సాఫీస్ కింగ్ అని “జైలర్” సినిమాతో నిరూపించుకున్నారు. ఆ ఊపులో ఆయన మరో రెండు సినిమాలు చెయ్యనున్నారు. “జైలర్” సినిమాతో వంద కోట్ల పారితోషికం, మరో వంద కోట్ల బోనస్ దక్కింది రజినీకాంత్ కి. కొత్తగా రెండు సినిమాలతో మరో 300 కోట్లు వెనకేసుకుంటారు.
హీరోగా ఆయన ఇమేజ్ మామూలు కాదు. కేవలం “బీజేపీ”కి అనుకూలంగా ఆయన పార్టీ పెట్టబోతున్నారు అన్న ప్రచారం కారణంగా తమిళనాడులో ఆ మధ్య ఆయనకి దెబ్బపడింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఐతే రాజకీయాల ఆలోచన విరమించుకున్న తర్వాతే మళ్లీ ఆయన సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఐతే, రజినీకాంత్ కు, బీజేపీకి మధ్య ఉన్న అనుబంధం వేరు. ఆయన బీజేపీ, ప్రధాని మోదీకి బాగా కావాల్సిన స్టార్. అందుకే, ఇప్పుడు మళ్ళీ గవర్నర్ పదవి అంటూ ప్రచారం మొదలైంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలకు రాను అని ప్రకటించారు కాబట్టి ఆయనకు గవర్నర్ పదవిని బీజేపీ సిద్ధం చేసిందన్న ప్రచారం ఊపందుకొంది. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగింది కానీ తాజాగా రజినీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కలవడంతో “బ్యాక్ డోర్ పాలిటిక్స్” గురించి చర్చ మొదలైంది.
ఐతే రజినీకాంత్ కి గవర్నర్ పదవి చాలా చిన్నది. అది రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళు పనిచేసి రిటైర్ అవ్వాలనుకునే వాళ్లకు బెస్ట్. రజినీకాంత్ లాంటివారికి అంతగా పనికొచ్చేది కాదు.