రేట్లపై సురేష్ బాబు హాట్ కామెంట్

Suresh Babu

నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ రెండు సినిమాలను డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశారు. ఆయన చేతిలో ఎన్నో థియేటర్లు ఉన్నాయి. కానీ ఆయనే సినిమాలను థియేటర్లలో విడుదల చెయ్యడం లేదు. ఈ రెండు సినిమాలే కాదు మరో మూడు సినిమాలు కూడా ఓటిటికి ఇచ్చేశారు.

“శాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త, డ్యాన్సింగ్ క్వీన్ అనే మూడు సినిమాలు ఓటీటీకి ఇచ్చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి,” అని అన్నారు సురేష్ బాబు.

ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. “ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు,” అంటున్నారు ఆయన.

“ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతోంది. ప్రొడక్ట్‌‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్స్ వేరు. కానీ ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది,” అనేది ఆయన అభిప్రాయం.

మరి రానా నటించిన “విరాటపర్వం” ఎప్పుడు విడుదల అవుతుంది? “ఇంకా ఐదు రోజుల బ్యాలన్స్ షూటింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు.”

సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటిని డబ్బుతో కొలవొద్దు అనేది సురేష్ బాబు మాట. మన హైదరాబాద్ దేశానికి సినీ రాజధాని చేసే విధంగా కేటీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. “సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది. డెవలప్‌మెంట్ జరుగుతుంది. సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు,” అని చెప్తున్నారు.

Advertisement
 

More

Related Stories