జగన్ ఒత్తిడి మాపై లేదు: సురేష్ బాబు

Suresh Babu

“వైజాగ్ లోని రామానాయుడు ఫిలిం స్టూడియో మా సొంతం. అందులో ప్రభుత్వ సొమ్ము లేదు. ప్రభుత్వ వాటా లేదు. మీడియా వార్తలు నమ్మకండి.” నిర్మాత సురేష్ బాబు చెప్తోన్న మాట ఇది.

వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’ ఎల్లుండి (July 20) అమెజాన్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో ముచ్చటించారు సురేష్ బాబు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్టూడియోని తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేయాలనుకుంటోంది అని మీడియా కథనాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తున్నారు. ప్రభుత్వ పాలన ఇక అక్కడినుంచి సాగుతుంది. అందుకే, మంచి లొకేషన్ లో ఉన్న ఈ స్టూడియోని తీసుకొని అక్కడ సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్.

సురేష్ బాబు మాత్రం ఇది తమ భూమి అని అంటున్నారు. ఐతే, ప్రభుత్వం అడిగితే ఇస్తారా అంటే… ఇది పర్సనల్ మేటర్ అని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ మీద ఒత్తిడి పెట్టడం లేదని, అదంతా మీడియా సృష్టి అని మాత్రం తేల్చారు.

‘నారప్ప’ని థియేటర్లో రిలీజ్ చెయ్యకూడదన్న నిర్ణయాన్ని కూడా అయన సమర్ధించుకున్నారు. “ఓటిటి”, థియేటర్లు … రెండూ ఇకపై ఉంటాయి. సినిమాలని కేవలం థియేటర్లోనే ముందు రిలీజ్ చేయాలనుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవాలనేది ఆయన పాలసీ.

Advertisement
 

More

Related Stories