స్టూడియో ఇవ్వలేనంటున్న సురేష్ బాబు

Venkatesh and Suresh Babu

వైజాగ్ లో ఉన్న రామానాయుడు స్టూడియోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇకపై వైజాగ్ నుంచి పాలించాలని అనుకుంటున్నారు. విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి చాలా కాలమే అయింది. అక్కడ పరిపాలన సాగించేందుకు అనుకూలమైన భవంతులు లేవు. దాంతో, మంచి లొకేషన్ లో ఉన్న రామానాయుడు స్టూడియో స్థలాన్ని తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐతే, నిర్మాత సురేష్ బాబు వర్గాలు చెప్తున్న మాట వేరుగా ఉంది. ఈ ప్రతిపాదన గతేడాదే వచ్చిందట. అప్పుడే తాము తిరస్కరించామని అంటున్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి అలాంటి ప్రొపోజల్ రాలేదని సురేష్ బాబు టీం చెప్తోంది.

ఐతే, సురేష్ బాబు నో చెప్పినా… ప్రభుత్వం కావాలనుకుంటే తీసుకోగలదు. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా వేరే స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ స్థలాన్ని అప్పట్లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు.

సురేష్ బాబు, వెంకటేష్ కుటుంబాలకు చెందిన ఈ స్టూడియోలో ప్రస్తుతం పెద్దగా సినిమా షూటింగులు జరగడం లేదు. కానీ భవిష్యత్ లో దీన్ని పెద్ద స్టూడియోగా మలచాలనే ఆలోచన దగ్గుబాటి కుటుంబానికి ఉంది. ఇప్పటికే, హైదరాబాద్ లో ఉన్న రామానాయుడు సినీ విలాగే ని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మేశారు. ఫిలిం నగర్ లో ఉన్న చిన్న స్టూడియో ఇప్పటి పరిస్థితులకు సరిపోదు.

Advertisement
 

More

Related Stories