సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం అందరిని కలిచివేసింది. గాడ్ ఫాదర్ లు లేకుండా హీరోగా పేరు తెచ్చుకున్న సాదాసీదా బిహారి కుర్రాడు సుశాంత్. హిందీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఒక స్టార్ గా నిలబడడం కష్టం. చాలా కష్టం.
ఎవరైనా అనుకోకుండా సర్రున దూసుకొచ్చి అనుకోకుండా కొన్ని విజయాలు సాధించినా… ఆ తర్వాత అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు. ఛాన్స్ దొరికితే బలమైన శక్తులు తొక్కేస్తాయి. పైకి నవ్వుతూనే… గొప్ప కబుర్లు చెప్తూనే.. బ్యాక్ నుంచి పుకార్లు లేపుతారు. “యారొగెంట్” అని, టెక్కు ఎక్కువని ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. రెండు ఫ్లాప్ ల వస్తే చాలు లేవకుండా చేస్తారు. జనం ముందు ఆప్యాయంగా వాటేసుకుంటారు, సందు దొరకగానే పాతేస్తారు.
ఈ మాట చాలా సార్లు ప్రూవ్ అయింది. ఆ మధ్య కంగనా రనౌత్ ఈ మాటలే చెప్పింది.
బాలీవుడ్ లో నేపోటిజం (హీరో,దర్శకుల,నిర్మాతల కొడుకులు, కూతుళ్లు,తమ్ముళ్లు,అల్లుళ్ళు, మేనల్లుళ్లు, బామ్మర్దులు, మనవళ్లు, మనవరాళ్లు ని ప్రోత్సహించే సంస్కృతి) పాతుకుపోయింది అని, కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు ఈ విష సంస్కృతిని పోషిస్తున్నారు అని కుండబద్దలు కొట్టింది. సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానికి దారి తీసిన కారణాలు కూడా అచ్ఛంగా పైన చెప్పినవే దారి తీశాయి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కంగనా పేరు ట్రెండ్ అవుతోంది.
సుశాంత్ సింగ్ తో కరణ్ జోహార్ “డ్రైవ్” అనే సినిమా రెండేళ్ల కింద మొదలు పెట్టాడు. కానీ సినిమా బాగా రాలేదని దాన్ని పక్కన పెట్టాడు. అలాగే ఆ సినిమాని డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయించాడు. సుశాంత్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా కరణ్ లిఫ్ట్ చెయ్యలేదు అంట. ఈ విషయాన్ని కరణ్ కూడా లేటెస్ట్ గా తన సోషల్ మీడియా పోస్ట్ లో ఒప్పుకున్నాడు. “ఏడాది పాటు నీతో టచ్ లో లేను. నీ బాధలు తెలుసుకోవాల్సింది. మానసికంగా అండగా ఉండాల్సింది. ఇలాంటి పొరపాటు ఇక చెయ్యను,” అని కరణ్ సుశాంత్ ని నివాళిగా రాసిన పోస్ట్ లో చెప్పుకున్నాడు.
దాంతో, ఇప్పుడు కరణ్ జోహార్ ని తిడుతూ, కంగనా ఎప్పుడో చెప్పింది అంటూ ఆమెని ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు.