
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పేరు చెప్పగానే ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘నెంబర్ వన్’, ‘ఘటత్కోచుడు’, ‘వినోదం’, ‘మావిచిగురు’, ‘పెళ్ళాం ఊరెళ్తే’, ‘హంగామా’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ఒకప్పుడు ఆయన క్రేజ్, రేంజ్ వేరు. 1990ల్లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆ వైభవం అంతా గతం.
దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టారు. ఆయన తీసిన తాజా చిత్రం… “ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు”. ఈ రోజు విడుదల అయింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ను బాలయ్య ఘోరంగా అవమానించారా..!?
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మృణాళిని రవి, రాజేంద్రప్రసాద్, మీనా మెయిన్ రోల్స్ లో నటించిన ఈ సినిమా చూసాక అందరికీ కలిగే భావన… ఆయన కథ మార్చలేదు, ఆయన కథ మారలేదు.
ఆయన చెప్పాలనుకున్న కథ పేలవం. ఆయన నేరేషన్ నీరసం. ఇక చూసిన ప్రేక్షకుల పరిస్థితి దారుణం. ఔట్ డేటెడ్ ఫార్ములాలోనే ఆయనది మరీ పాతది. అందుకే, మొదటి రోజు చూసిన కొద్ది మంది ప్రేక్షకులు కూడా తిట్టుకుంటూ బయటికి వస్తున్నారట థియేటర్ల నుంచి.
ఒక ఏజ్ వచ్చాక ఎంత పెద్ద దర్శకులకైనా ఆలోచనల్లో పదును తగ్గుతుంది. అలాంటప్పుడే కొత్త తరం సాయం తీసుకోవాలి. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అన్నీ ఆయనే. కొన్ని బాధ్యతలన్నా నేటి తరం వరకు ఇస్తే కొంతలో కొంత అన్నా ఆర్గానిక్ గా ఉండేది.