సర్కారు వారి పాట – తెలుగు రివ్యూ

Sarkaru Vaari Paata

పెద్ద హీరోల్ని, వాళ్ల స్టార్ డమ్ ను హ్యాండిల్ చేయడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. ఈ క్రమంలో చాలామంది దర్శకులు కథ లేదా మాటలు లేదా స్క్రీన్ ప్లేలో ఏదో ఒక దానిపై పట్టుకోల్పోతారు. తమ మార్క్ మిస్ అవుతారు. సర్కారువారి పాట సినిమాలో కూడా ఇదే జరిగింది. మహేష్ లాంటి పెద్ద స్టార్ ను హ్యాండిల్ చేసే క్రమంలో పరశురామ్ తన మార్క్ కోల్పోయాడు. అన్నింటికంటే ముఖ్యంగా కథనంపై పట్టు కోల్పోయాడు. సర్కారువారి పాట సినిమాకు ఇదే పెద్ద మైనస్.

సినిమాలో మంచి కథ ఉంది. మంచి పాయింట్ ను చర్చించారు. పెద్ద హీరోను, హీరోయిన్ ను పెట్టుకున్నారు. కానీ హీరో కోసం పరశురామ్ చేసిన ప్రయత్నాలు కథను పక్కదోవ పట్టించాయి. చెప్పాల్సిన పాయింట్ ను బలంగా చెప్పలేకపోయాయి. ఉదాహరణకు సెకెండాఫ్ నే తీసుకుంటే.. మహేష్ కు కీర్తిసురేష్ పడిపోయే ట్రాక్ మొత్తం కథతో సంబంధం లేకుండా సాగుతుంది. ఇక ఫస్టాఫ్ లో చూసుకుంటే.. ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడం కోసం హీరో ఎంత దూరమైనా వెళ్తాడనే విషయాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కేవలం పెన్నీ సాంగ్ లో చూపించి సరిపెట్టారు. దీంతో 10వేల డాలర్ల కోసం హీరో అమెరికా నుంచి వైజాగ్ వచ్చాడనే పాయింట్ బలంగా అనిపించలేదు. ఆ తర్వాత దాన్ని హీరో డైలాగ్స్ తో బలంగా రిజిస్టర్ చేయించినప్పటికీ, అప్పటికే ఆడియన్స్ మైండ్ లో పడిపోయిన రిమార్క్ ను అది తుడిచిపెట్టలేకపోయింది. ఇంతకుముందే చెప్పుకున్న హీరో ఇమేజ్, ఎలివేషన్స్ పై ఎక్కువగా దృష్టిపెట్టిన దర్శకుడు.. నెరేషన్ పై పట్టు కోల్పోవడంతో పాటు, తన మార్క్ డైలాగ్స్ ను కూడా మిస్సయ్యాడు.

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి లోన్లు ఎగ్గొట్టడం. చాలామంది పెద్దోళ్లు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం, దాన్ని ఎగ్గొట్టడం ఆనవాయితీగా మారిపోయింది. మరి అలాంటప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? వివిధ ఛార్జీల రూపంలో ఆ భారాన్ని సామాన్యులపై మోపుతాయి. ఈ విషయాన్ని సర్కారువారి పాట సినిమాలో చక్కగా చూపించారు. సామాన్యులపై ఆ భారం ఎలా పడుతుందనే అంశాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ క్రమంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు దర్శకుడు. ఓ కాలనీలో మహేష్ బాబు క్లాస్ పీకితే.. టోటల్ వైజాగ్ అంతా ఈఏంఐలు కట్టమంటూ బోర్డులు తగిలించడం, అదో పెద్ద ఉద్యమంగా మారడం లాంటి వ్యవహారాల్ని నమ్మేవిధంగా తెరకెక్కించలేకపోయాడు.

మహేష్ తల్లిదండ్రులు లోన్ కట్టలేక ఆత్మహత్య చేసుకునే ఎపిసోడ్ నుంచి సినిమా స్టార్ట్ చేసిన దర్శకుడు.. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే మహేష్ ను అప్పులిచ్చే మనీలెండర్ గా అమెరికాలో పరిచయం చేస్తాడు. తన విలాసాల కోసం హీరోని బకరాను చేసి ఆడుకుంటుంది హీరోయిన్. సదరు హీరోయిన్ తనను మోసం చేసిందని తెలుసుకున్న హీరో, ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకొచ్చేందుకు, ఆమె తండ్రి ఉంటున్న విశాఖపట్నం వస్తాడు. 10వేల డాలర్ల వసూలు కోసం వచ్చిన హీరో, హీరోయిన్ తండ్రి నుంచి ఏకంగా 10వేల కోట్లు రికవర్ చేస్తాడు. అలా ఎందుకు చేశాడు అనేది స్టోరీ. ఇలా స్టోరీ మొత్తం బ్యాంకులు, అప్పులు, డబ్బు, ఈఏంఐల చుట్టూ తిరుగుతుంది. హీరో క్యారెక్టరైజేషన్, రొమాంటిక్ ట్రాక్, విలన్లతో ఎందుకు హీరో ఫైట్ చేస్తాడు.. ఇలా అన్నింటినీ లోన్స్ కు తెలివిగా లింక్ పెట్టాడు దర్శకుడు.

పరశురామ్ ఈ సినిమా కథపై కసరత్తు చేశాడనే విషయం అర్థమౌతుంది. మంచి టాపిక్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే మిక్స్ చేశాడు. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు పెద్ద హీరోను హ్యాండిల్ చేసే క్రమంలో నెరేషన్ గ్రిప్పింగ్ గా లేదు. సినిమాలో అన్నింటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు పరశురామ్. దీంతో ‘సర్కారువారి పాట’ లో మహేష్ బాబు ఆట ఎక్కువగా కనిపిస్తుంది తప్ప, పరశురామ్ తీత మెరవదు.

ఫస్టాఫ్ మొత్తాన్ని వినోదాత్మకంగా కొనసాగించిన దర్శకుడు, ఇంటర్వెల్ బ్యాంగ్ కు వచ్చేసరికి మంచి ట్విస్ట్ ఇస్తాడు. మెయిన్ పాయింట్ ను సెకండాఫ్ లోనే తెరపైకి తీసుకొచ్చిన డైరక్టర్, ప్రీ-క్లైమాక్స్ కోసం కొన్ని మంచి డైలాగ్స్ రాసుకున్నాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించాలనే ఒత్తిడిలో క్లైమాక్స్ ను అందరూ ఊహించే విధంగా మాత్రమే తీయగలిగాడు. దీంతో సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువగా బాగుందనే ఫీలింగ్ వస్తుంది. ఓ సినిమాకు సెకెండాఫ్ పై కంప్లయింట్ రావడం పెద్ద రిమార్క్ అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇవన్నీ ఒకెత్తయితే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే మహేష్ తో కాస్త అసభ్యంగా పలికించడం, అసభ్యకరమైన పనులు చేయించడం ఈ సినిమాకు మరో మైనస్ అయింది. హీరోయిన్ ను రాత్రికి ఉంచుకొని పొద్దున్నే పంపిస్తానని చెప్పడం, ప్రతిసారి ఆమెపై కాలు వేసి పడుకోవడం, ఈ సన్నివేశాలతో పాటు, అందులో వచ్చే డైలాగ్ లు మహేష్ స్థాయికి తగ్గవి కాదు. వీటితో పాటు సినిమాలో మహేష్ తో బూతు డైలాగ్స్ (మ్యూట్స్ పడ్డాయి) చెప్పించడం కూడా కరెక్ట్ కాదు.

ఇలాంటి నెగెటివ్ పాయింట్స్ చాలా ఉన్నప్పటికీ, మహేష్ బాబు తన ఛార్మ్ లుక్స్ తో చాలా వరకు మైమరిపించగలిగాడు. అతడి లుక్, యాక్టింగ్, కామెడీ టైమింగ్, డాన్స్ సూపర్బ్. సినిమా మొత్తాన్ని తన భుజంపై మోసిన మహేష్, చాలా మిస్టేక్స్ ను కవర్ చేసే ప్రయత్నం చేశారు. కీర్తిసురేష్, వెన్నెల కిషోర్, సముత్తరఖని, సుబ్బరాజు.. తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రల కోసం పేరున్న చాలామంది నటీనటుల్ని తీసుకున్నప్పటికీ ఎవరికీ చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు దర్శకుడు. టెక్నికల్ గా చూసుకుంటే.. తమన్ సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

బాటమ్ లైన్:

మహేష్ హీరోగా నటించిన ‘సర్కారువారి’ పాట సినిమా మొత్తం ఫార్ములా టైపులో నడిచిపోతుంది, కొన్ని చోట్ల నవ్విస్తుంది, మరికొన్ని చోట్ల చిరాకు పుట్టిస్తుంది. ఐతే, మహేష్ వన్ మే షో, అతడి కామిక్ టైమింగ్ వల్ల కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది.

Rating: 2.75/5

Review By – పంచ్ పట్నాయక్

Advertisement
 

More

Related Stories