
టబు వెర్సటెయిల్ నటి. హీరోయిన్ గా అందాలు ఆరబోశారు. అభినయం చెయ్యాల్సిన పాత్రలో గొప్ప నటన ప్రదర్శించారు. తల్లి పాత్రల్లో కూడా ఆమెది విలక్షణమైన నటన. అల్లు అర్జున్, షాహిద్ కపూర్ వంటి హీరోలకు తల్లిగా, ఇషాన్ ఖట్టర్ వంటి కుర్ర హీరోలను సెడ్యూస్ చేసే ఆంటీగా వైవిధ్యం చూపడం ఆమెకే చెల్లింది.
ఒకే ఇమేజ్ కి కట్టుబడి ఉండకుండా 50 ప్లస్ వయసులో కూడా మంచి పాత్రలు పొందుతున్నారు టబు.
“ఇప్పడు ఏదైనా చేస్తాను. తల్లి పాత్రనా అని సంకోచించేది లేదు. విలన్ పాత్ర అనే భయం లేదు. ఏదైనా చెయ్యగలను. పాత్రకు తగ్గట్లు మలుచుకోగలను. ఎప్పుడైతే ఒక నటి ఇమేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదో అప్పుడు మంచి పాత్రలు దక్కుతాయి,” అని తన సక్సెస్ సీక్రెట్ బయట పెట్టారు టబు.
ఆమె ‘అంధాదున్’ సినిమాలో విలన్ గా నటించారు. ఆమె చేసిన ఆ పాత్రని తెలుగులో తమన్న (‘మాస్ట్రో’), మలయాళంలో మమతా మోహన్ దాస్ (భ్రమరం) చేసి ఫెయిల్ అయ్యారు. టబు ముందు వారి నటన తేలిపోయింది. అది టబు సత్తా.