
తెలుగులో చిన్న చిత్రాల్లో పెద్ద హిట్ అయిన వాటిలో ఒకటి… ‘ఆర్‌ఎక్స్ 100’. ఆ మూవీతో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కెరీర్లు సెట్ అయ్యాయి. వారు ఇప్పటికే అనేక సినిమాలు చేశారు. ఆ సినిమా తీసిన దర్శకుడు అజయ్ భూపతి మాత్రం తన రెండో చిత్రంతో (“మహా సముద్రం”) చతికిలా పడ్డారు. మొదటి సినిమాతో వచ్చిన హైప్ అంతా తుస్సుమంది.
ఐతే, “ఆర్‌ఎక్స్ 100” ఉన్న మెయిన్ పాయింట్ – హీరోయినే విలన్ – చాలామందికి బాగా నచ్చింది. అందుకే, ఇప్పుడు ఆ మూవీ హిందీలో ‘తడప్’ పేరుతో రీమేకయి డిసెంబర్ 3న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ హిందీ మూవీ ట్రైలర్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యడం విశేషం. ఎందుకంటే ‘తడప్’ లో నటించింది ఎవరో కాదు సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి. పాయల్ రాజపుత్ పాత్రలో తార సుతారియా నటిస్తోంది.
‘డర్టీ పిక్చర్’, ‘ఒన్స్ అపాన్ టైం ఇన్ ముంబై’ వంటి చిత్రాలు తీసిన మిలన్ లుథ్రియా ఈ సినిమాకి దర్శకుడు. ఆయన తెలుగు కథకు మరింత ఇంటెన్సిటీ, భారీతనం జోడించారు. తెలుగులో కార్తికేయ సెటిల్ అయినట్లు సునీల్ శెట్టి కొడుకు ‘తడప్’తో హిందీలో హీరోగా నిలబడుతాడా అన్నది చూడాలి.