
ఏరు దాటాక తెప్ప తగిలేసే బ్యాచ్ బాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువ. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఇక్కడ డబ్బు బాగా సంపాదించి తర్వాత కొన్నాళ్ళకు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడే అలవాటు ఉంది వాళ్లకు. ఇంతకుముందు పలువురు హీరోయిన్లను చూశాం. ఆ జాబితాలో తాప్సి ఒకరు.
ఆమె గతంలో కూడా తెలుగు సినిమాల గురించి, తెలుగు సినిమాల పాటల చిత్రీకరణ గురించి మాట్లాడింది. అప్పుడు మన వాళ్ళు ఇచ్చి పడేశారు. దాంతో, కొన్నాళ్ళు నోరు మెదపలేదు.
మళ్ళీ ఆమె నోరు జారింది తాప్సి.
దక్షిణాది చిత్రసీమలో తన టాలెంటుని ఎవరూ గుర్తించలేదని తాజాగా ఈ అమ్మడు వాపోయింది. తనలోని నటిని ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ గుర్తించలేదంట. తనకు నటించే పాత్రలు ఇవ్వకుండా రొటీన్ గ్లామర్ పాత్రలు ఇచ్చారని విమర్శించింది. అందుకే, సౌత్ సినిమాలు తనకు సంతృప్తినివ్వలేదు అంటోంది.

నిజంగా ఆమెకి ఆ రోల్స్ నచ్చకపోతే చెయ్యకుండా ఉండాల్సింది. ఆమెని ఎవరూ బలవంతంగా ఆ పాత్రల్లో నటింపచెయ్యలేదు కదా. అప్పుడు అందాల ప్రదర్శనకైనా రెడీ అని డబ్బులు వెనకేసుకొంది. ఇప్పుడు బాలీవుడ్ లో కాస్త గుర్తింపు రాగానే దక్షిణాది చిత్రాలపై చులకనగా మాట్లాడుతోంది.
పోనీ, తాప్సి ఏమైనా సావిత్రి, స్మిత పాటిల్ రేంజ్ ఉన్న నటినా? అంత సీన్ లేదు. కానీ, దక్షిణాది చిత్రాలపై ఆమె ఏడుపు ఆగట్లేదు.