తెలుగు-తమిళ్: ఒక వికెట్ డౌన్

Prince

పాన్ ఇండియా సినిమాలు అనే క్రేజ్ మన తెలుగు వాళ్ళకి ఉంది. ఇక తమిళ హీరోలకు తెలుగు మార్కెట్ కైవసం చేసుకోవాలన్న కోరిక ఎక్కువ. సూర్య, కార్తీ, విక్రమ్ వంటి హీరోలకు ఇప్పటికే తెలుగులో ఒక గుర్తింపు, మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్ లకు తెలుగు హీరోలకు సమానంగా పాపులారిటీ ఉంది. ఇక ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా మంచి క్రేజ్ పొందాడు.

రజినీకాంత్ కి సమానంగా తెలుగులో మార్కెట్ తెచ్చుకోవాలని విజయ్ ఇప్పుడు తెలుగు-తమిళ్ సినిమా చేస్తున్నాడు. అదే ‘వరిసు’/’వారసుడు’. దర్శకుడు తెలుగువాడే… వంశీ పైడిపల్లి. ఇదే పద్దతిలో ధనుష్ కూడా తన తెలుగు మార్కెట్ పెంచుకోవాలని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ‘వాతి’/’సార్’ అనే సినిమా చేస్తున్నాడు.

వీరి బాటలోనే మరో యువ తమిళ హీరో శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ పేరుతో తెలుగు-తమిళ్ సినిమా చేశాడు. ఈ తెలుగు-తమిళ్ ట్రెండ్ లో మొదట విడుదలైంది ‘ప్రిన్స్’. దీపావళి కానుకగా గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఢమాల్ అయింది. తెలుగులో ఆడట్లేదు. తమిళ్ లో కూడా గోవిందే.

అంటే… తెలుగు-తమిళ్ సినిమాల ట్రెండ్ లో మొదటి వికెట్ పడింది. మరి మిగతా రెండు సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
 

More

Related Stories