ఎఫ్3లో ఫన్ మాత్రమే ఉంటుందా?

ఎఫ్3 సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా కామెడీ గుర్తొస్తుంది. ఈ సినిమాలో కచ్చితంగా ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి కూడా అదే చెబుతున్నాడు. అయితే కామెడీతో పాటు ఎఫ్3లో మంచి కంటెంట్ కూడా ఉంటుందని హామీ ఇస్తున్నాడు.

ఎఫ్2 సినిమాలో భార్యాభర్తల మధ్య అనుబంధం, అవగాహనరాహిత్యం లాంటి విషయాల్ని చర్చించాడు అనిల్ రావిపూడి. ఎఫ్3లో మనిషికి మనీ ఎంత అవసరం, మనీ బంధాలు మానవ సంబంధాల్ని ఎలా దెబ్బతీస్తున్నాయనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఎఫ్2లో నాజర్ తో సందేశం అందించిన రావిపూడి, ఎఫ్3లో ఆ బాధ్యతను మురళీశర్మకు అప్పగించాడు.

“ఎఫ్2 హిట్టయిన వెంటనే మనీ కాన్సెప్ట్ లో ఎఫ్3 అనుకున్నాను. ఎందుకంటే, అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను అనుకున్నప్పటికీ కరోనా స్టార్ట్ అవ్వలేదు, కరోనా వచ్చిన తర్వాత డబ్బు విలువ మరింతగా తెలిసొచ్చింది. మనీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది తెలిసింది. మనిషి జీవితంలో మనీ ఎంత వరకు ఇంపార్టెంట్ అనే పాయింట్ ను జెన్యూన్ గా చెబుదాం అనిపించింది. ఎఫ్2లో ఎంత నవ్వించినా ఓ మంచి కంటెంట్ చెప్పాం. అదే విధంగా ఎఫ్3లో కూడా బాగా నవ్విస్తాం, మనీకి సంబంధించి మంచి కంటెంట్ కూడా చెబుతాం. మనిషి లైఫ్ ను మనీ ఎలా రూల్ చేస్తుందనేది వివరిస్తాం.”

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలోకి వస్తోంది. కుటుంబ ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు వీలుగా, ఈ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం లేదు. సాధారణ టికెట్ రేట్లతోనే మొదటి రోజు నుంచి ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాల్ని ఇస్తుందని ట్రేడ్ భావిస్తోంది.

Advertisement
 

More

Related Stories