
‘వకీల్ సాబ్’ విడుదలైన వారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శన నిలిపివేశారు. సెకండ్ వేవ్ ముదరడంతో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణాలో థియేటర్లను అన్ని తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్టీప్లెక్స్ లు, కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రారంభం కానున్నాయి. దాంతో, మొదటి వీకెండే 5 సినిమాలు విడుదల కానున్నాయి.
సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’, తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ ఈ నెల 30న విడుదల అవుతున్నాయి. వీటితో పాటు మరో మూడు చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. “త్రయం”, “నరసింహపురం”, “పరిగెత్తు పరిగెత్తు” అనే మూడు సినిమాలు జులై 30నే థియేటర్లోకి వస్తామని పోస్టర్స్ రిలీజ్ చేశాయి. ఈ సినిమాల హీరోలు, దర్శకులెవ్వరూ మనకు పరిచయం లేనివారే.
మిగతా మూడు చిన్న సినిమాలను పక్కన పెట్టినా ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ చిత్రాలు ఎలా ఆడుతాయి అనేది కీలకం. ఈ సినిమాల ఫలితంపైనే మిగతా సినిమాల విడుదల ఆధారపడి ఉంది.
నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’, నాని నటించిన ‘టక్ జగదీష్’, గోపీచంద్, తమన్నాల ‘సీటిమార్’, యువ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ చిత్రం ‘పాగల్’ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఐతే, ఇవన్నీ విడుదల కావాలంటే ఈ వీకెండ్ సినిమాలకు ప్రేక్షకులు రావాలి. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో అన్ని థియేటర్లు ఓపెన్ కావాలి.