ప్రేక్షకుల నుంచి వడ్డీల వసూళ్లు!

- Advertisement -
Acharya Press Meet

రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి అడ్డగోలుగా టికెట్ పెంచారు. ప్రభుత్వాల దగ్గర ఉన్న పరపతితో తెలంగాణాలో, ఆంధ్రపదేశ్ లో టికెట్ రేట్లు పెరిగేలా చేసుకున్నారు. ఇక ఇప్పుడు ‘ఆచార్య’కి కూడా రేట్లు పెరిగాయి రెండు రాష్ట్రాల్లో.

“ఆర్ ఆర్ ఆర్” అంటే పెద్ద బడ్జెట్ తో కూడిన పాన్ ఇండియా సినిమా. మరి, మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా చిత్రమా? దానికి, కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి సమాధానం ఇచ్చారు. “ఈ సినిమా మేకింగ్ లో రెండేళ్లు పాండమిక్ వల్ల నష్టపోయాం. ఇప్పటికీ ఇంకా మేము ఎకౌంట్స్ సెటిల్ చెయ్యలేదు. నేను కానీ, చిరంజీవి గారు కానీ డబ్బులు తీసుకోలేదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఇది పెద్ద బడ్జెట్ మూవీనే,” అని అన్నారు కొరటాల.

దీనిపై మరింత వివరణ ఇచ్చారు మెగాస్టార్.

“కరోనా మహమ్మారితో ప్రతి రంగం కుంటుపడింది. ఒక సినిమాకి 50 కోట్ల వడ్డీలు అన్న మాట ఎప్పుడైనా విన్నారా అండి? మేం కట్టాం. అవి ఎవరిస్తారు చెప్పండి. ప్రభుత్వాలు కనికరించి జీవోలు ఇస్తే, మనకు ఇంత వినోదం ఇస్తే మనం కూడా పది రూపాయలు ఎక్కువ ఇద్దామని ప్రేక్షకులు చేస్తున్నారు. ఇది అడుక్కోవడం కాదు. ఆపదొచ్చినప్పుడు చేయూత ఇవ్వడంలాంటిది,” అని చిరంజీవి చెప్పారు.

అంటే, ప్రేక్షకుల దగ్గర సినిమాకి అయిన వడ్డీల భారాన్ని లాగుతున్నారన్నమాట. ఈ విషయమై మీడియా కూడా ఎక్కువ లాగొద్దు. ఎందుకంటే, ప్రేక్షకులపై భారం వేస్తున్నారని జర్నలిస్టులు ప్రశ్నిస్తే … “ఆర్మ్ చైర్ క్రిటిక్స్”ని జనం పట్టించుకోకుండా సినిమాని హిట్ చేశారని RRR “ఆర్మ్ చైర్ పబ్లిసిటీ” టీం చంకలు గుద్దుకొంది. వాళ్ళ దృష్టిలో మీడియా ప్రశ్నించొద్దు… భజన చెయ్యాలి.

 

More

Related Stories