
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు సినిమా టికెట్ల ధరలను సవరించింది. కొత్త జీవో అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో థియేటర్ల కనిష్ట ధర రూ. 20గా, గరిష్ట ధర రూ. 150గా నిర్ణయించింది. దీనికి జీఎస్టీ అదనం.
ఏడాది క్రితం వరకు కనిష్ట ధర రూ. 40, గరిష్ట ధర రూ. 125గా ఉండేది. కానీ అన్ని థియేటర్లు ప్రభుత్వ ధరలతో సంబంధం లేకుండా పెద్ద సినిమా విడుదలైనప్పుడు ఫ్లాట్ రేట్ అంటూ 200 రూపాయలకు పైనే అమ్మేవారు.
సినిమా టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో తెస్తామని ఏకపక్షంగా గతేడాది టికెట్ ధరలను తగ్గించింది జగన్ ప్రభుత్వం. దీనిపై పెద్ద రాజకీయ రగడ జరిగింది. ఎన్నో సమావేశాలు, ఎన్నో విజ్ఞప్తుల తర్వాత వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఏడాది తర్వాత రేట్లను పెంచింది. కనిష్ట ధరని 10 రూపాయలకు తగ్గించడం మినహా ప్రభుత్వం సాధించింది ఏమి లేదు. నిజానికి సామాన్యులకు అందుబాటులోకి టికెట్ ధరలు అని ఈ గోల అంతా చేసిన ప్రభుత్వం చివరికి గతంలో ఉన్న గరిష్ట ధరని 30 రూపాయలకు పెంచి మళ్లీ అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేసుకొనే అవకాశం ఇచ్చింది.
అంటే, సామాన్యుల కోసం అని పైకి హడావిడి చేసి చివరికి మునుపటి కన్నా స్వల్పంగా రేట్లని పెంచింది. జగన్ ప్రభుత్వం ఏడాదిపాటు చేసిన ప్రహసనం అంతా ఒక్క హీరోని (పవన్ కళ్యాణ్) ఇబ్బంది పెట్టేందుకే చేసింది అని అర్థం అవుతోంది. ఒక్క హీరో మీద రాజకీయ కక్ష సాధింపు కోసం మొత్తం ఇండస్ట్రీని ఏడాదిపాటు ఆగం చేశారు.
చివరికి సాధించింది ఏమిటి? ఏవీఎస్ అన్నట్లు అదో తుత్తి అనుకోవాలి.